పేరుకుపోయిన బకాయిలు

Apr 15,2025 22:20
పన్నుల బకాయిలు పేరుకుపోయాయి.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీల్లో పన్నుల బకాయిలు పేరుకుపోయాయి. వసూళ్ల లక్ష్యాన్ని చేసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ కారణాలతో వసూళ్లు ముందుకు సాగని నేపథ్యంలో భారీగా బకాయిలు నిలిచిపోయి పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మార్చి ముగిసిపోయి ఏప్రిల్‌ 15 దాటుతున్నా కలెక్షన్స్‌ అంతగా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఇంటి పన్నులు 61.43 శాతం, పన్నేతర బకాయిల కలెక్షన్‌ 58.91 శాతం మించలేదు.జిల్లాలో 21 మండలాల్లో 385 పంచాయతీలున్నాయి. వీటిల్లో 3,48,065 అసెస్మెంట్‌ల నుంచి ఏటా పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపాలతో పలు గ్రామపంచాయతీల్లో పన్ను బకాయిలు ఏటా పేరుకుపోతున్నాయి. సచివాలయ సిబ్బంది ఉన్నా వసూళ్లులో వేగవంతం కనిపించడం లేదు. వివిధ కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు సక్రమంగా కాలేదని, ఈ ఏడాది వసూళ్లు సమయానికి సార్వత్రిక ఎన్నికలు విధులు వలన లక్షాన్ని చేరుకోలేకపోయామని అధికారులు దాటవేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక పంచాయతీలు ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ భారం, సిబ్బందికి సైతం సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పలు చోట్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పూర్తిస్థాయిలో పన్నులు వసూలు కాకపోవడంతో పంచాయతీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పన్నులతోపాటు పాత బకాయిలు కూడా వసూలు చేయాలని జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శులకు వివిధ సమావేశాల్లో ఆదేశాలు జారీ చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు.పెద్దాపురం డివిజన్లో కాస్త మెరుగుజిల్లాలో డివిజన్‌ల వారీగా చూస్తే 2024-25 లో పెద్దాపురం డివిజన్‌ పన్నుల వసూళ్లలో ముందంజలో నిలిచింది. ఈ డివిజన్లో 11 మండలాల పరిధిలో 213 పంచాయతీలుండగా సుమారు రూ.20.02 కోట్లు వసూలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు రూ.15.53 కోట్లు (77.60 శాతం) వసూలు అయింది. కాకినాడ డివిజన్‌లో 9 మండలాలుండగా 172 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.45.79 కోట్లు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు రూ.24.89 కోట్లు (54.36 శాతం) మాత్రమే వసూలు అయింది. జిల్లా మొత్తంగా ఇంటి పన్నుల రూపేణా సుమారు రూ.65.81 కోట్లు బకాయిలు ఉండగా ఇప్పటి వరకు దాదాపు 40.42 కోట్లు (61.43శాతం) వసూలు అయింది. ఇంకా సుమారు రూ.25.56 కోట్లు వసూలు అవ్వాలి. అలాగే కుళాయి, చెట్లు, చేపల చెరువులు, గడ్డి పాటలు, లైసెన్స్‌ ఫీజులు ఇలా నాన్‌ టాక్స్‌లు రూపేణా సుమారు రూ.10.15 కోట్లకు గానూ ఇప్పటి వరకు దాదాపు రూ.5.98 కోట్లు (58.91 శాతం) వసూలు అయింది. ఇంకా రూ.4.17 కోట్లు వసూలు కావాల్సి ఉంది. చాలా గ్రామాల్లో పన్ను బకాయిలు పేరుకుపో తున్నాయి. ఇటీవల వీధి దీపాలు బకాయిలు చెల్లించాల్సి రావడంతో వాటికి కూడా ఆర్థిక సంఘ నిధులనే వినియోగించుకోవాల్సి వచ్చింది.అభివృద్ధి పనులపై ప్రభావంఆర్థిక సంఘ నిధులు పంచాయతీలను కొంతమేరకు ఆదుకున్నా, పన్నులు నూరు శాతం వసూళ్లు సాధిస్తేనే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అనేక పంచాయతీలకు సరైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక సంఘ నిధులు విడుదల అయినా వాటిని ప్రభుత్వం నిర్ధేశించిన కొన్ని పనులకు మాత్రమే వెచ్చించాల్సి ఉంది. పంచాయతీలకు ఆదాయ వనరు అయిన పన్నులు, బకాయిలు వసూలు కాకపోవడంతో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రభావం చూపుతోందని అధికారులు వాపోతున్నారు.

➡️