ప్రజాశక్తి – కాకినాడ
ఆశ వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్న కాట్రావులపల్లి పిహెచ్‌సి హెల్త్ సూపర్‌వైజర్ కనకరాజుపై చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమళ్ళ పద్మ, నర్ల ఈశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాట్రావులపల్లి పిహెచ్‌సిలో కొంతకాలం కిందట లంచాల బాగోతం బయటపడిందన్నారు. ఇప్పుడేమో హెల్త్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న కనకరాజు మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మద్యం సేవించి ప్రజల మధ్యలో ఆశ వర్కర్లను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. సూపర్‌వైజర్‌కు సంబంధం లేకపోయినా ఆశ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని పదే పదే వేధించడం జరుగుతుందని అన్నారు. ఎఎన్‌ఎం, ఆశ వర్కర్ల పట్ల ప్రవర్తిస్తున్న తీరును మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సైతం సూపర్‌వైజర్‌కు వత్తాసు పలుకడం బాధాకరమని అన్నారు. తక్షణమే సంబంధిత సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకోవాలని జెసిని కోరినట్లు వారు తెలిపారు.