ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి

May 19,2024 22:39
ధాన్యానికి గిట్టుబాటు ధర

ప్రజాశక్తి – కాజులూరు

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలనీ జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని చేదువాడ, కాజులూరు, శీలలంక గ్రామాల్లో ధాన్యం అమ్మకాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు కల్గుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా రైతులు పిల్లి శ్రీనివాసు, వాసంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ క్వింటాకు మద్దతు ధర రూ.2,200 అని ప్రకటించినా ఆచరణలో రూ.2 వేలు ఇస్తున్నారని, 75 కేజీలకు రూ.1500 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వింటాకు కనీస ధర రూ.4 వేలు ఇవ్వాలని ఢిల్లీ కేంద్రంగా రైతుల పెద్దఎత్తున పోరాటం చేశారని గుర్తు చేశారు. అయినా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తి నట్లు వ్యవహరిస్తుందన్నారు. రైతు ఉద్యమం ఫలి తంగా ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని అన్నారు. 2014లో ప్రభుత్వం వేసిన మూడు కమిషన్లు ధాన్యానికి గిట్టుబాటు ధర రూ.3300 ఇవ్వాలని నివేదిక ఇచ్చిందని, అయినా బిజెపి ప్రభు త్వం పట్టించు కోలేదని అన్నారు. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీల ఖర్చులు, యంత్రాల ఖర్చులు భూ యజమానికి ఇవ్వాల్సిన కౌలుతో కనీసం క్వింటాకు రూ.4 వేలు ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. మద్దతు ధరకు సిఎం ఆర్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయలేని కారణం గా మిల్లర్లు రైతుల వద్ద క్వింటాకు రూ.200 తగ్గించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేరళ తరహాలో ప్రత్యేక నిధి ద్వారా రైతుకు రూ.900 క్వింటాకు ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నా వైసిపి ప్రభుత్వం పట్టించు కోవడం లేదని అన్నారు. ప్రభుత్వమే ధాన్యం కొను గోలు చేయాలని, ధాన్యంను మిల్లులకు చేర్చడానికి అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

➡️