ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి సర్దుబాటు పేరుతో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఇంధన విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు ఛార్జీల పేరిట వినియోగదారుల నుంచి మరో 15 నెలల పాటు అదనపు వసూలు చేసుకునేలా ఎపి విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఎపిఇపిడిసిఎల్‌కు అనుమతులు ఇచ్చింది. దీంతో సామాన్యుడికి ప్రతి నెలా విద్యుత్ ఛార్జీల షాక్ తగలనుంది. ఇంధన విద్యుత్ కొనుగోలు ఖర్చును ప్రభుత్వం భరిస్తే ఛార్జీల పెంపు ఉండదు. కానీ ఈ సర్దుబాటు భారాన్ని తాము మోయలేమంటూ నూతన ప్రభుత్వం మొండి చేయి చూపించింది. దీంతో విద్యుత్ ఛార్జీల భారం జనం నెత్తినపడనుంది. 2022-2023లో వాడిన కరెంటుకు ఈ ఈ నవంబర్ నుంచి 2026 జనవరి వరకూ సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ క్రమంలో గరిష్టంగా యూనిట్‌కు రూ.1.55 వరకు విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా జనాల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదునెలల్లోనే ఇలా సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై భారం మోపడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కింది. జిల్లాపై సుమారు రూ.10 కోట్ల భారంఉమ్మడి జిల్లాలో 19.16లక్షల విద్యుత కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహాలకు సంబంధించి 16.23 లక్షల గహాల కనెక్షన్లు ఉన్నాయి. వీటితోపాటు, వాణిజ్యం, పరిశ్రమలు, తాగునీటి కనెక్షన్లు, వీధిలైట్లు తదితర కనెక్షన్లు 3.07 లక్షలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం రోజువారీగా 20 మిలియన యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇంతవరకూ ఈ విద్యుత్ కనెక్షన్‌ల నుంచి విద్యుత్ వినియోగం దృష్ట్యా అన్ని రకాల ఛార్జీలతో కలిపి సుమారు రూ.205 కోట్ల వరకూ డిమాండ్ కాగా తాజాగా మరో రూ.10 కోట్లు అదనంగా డిమాండ్ పెరగనుందని అంచనా.పెరుగుదల ఇలా…ఇంతవరకు గృహ వినియోగదారునికి నెలకు 30 యూనిట్‌ల లోపు వరకు యూనిట్ రూ.1.90 వసూలు చేస్తున్నారు. తాజాగా ఇంధన సర్దుబాటు ఛార్జీలతో కలిపి ఇదే యూనిట్‌కు కనిష్టంగా రూ.3.20 వరకు వసూలు చేయనున్నారు. అలాగే 400 యూనిట్ల వరకు నమోదైన వినియోగదారునికి యూనిట్ ధర ప్రస్తుతానికి రూ.9.75 కాగా ఇక యూనిట్ ధర రూ.12.30 వరకు పెరగనుంది. అంటే ప్రస్తుతం చెల్లించే నెలవారీ కరెంటు బిల్లుకు దాదాపు రెట్టింపు ఛార్జీల చెల్లించాల్సి వస్తుంది. ఎన్నికల ముందు హామీ బుట్టదాఖలువిద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు టిడిపి అధినేత చంద్రబాబు కొవ్వూరులో నిర్వహించిన బహిరంగ సభలో తొలిసారిగా ప్రకటించిన విషయం విధితమే. ఉభయ గోదావరి జిల్లాపై కూటమి కేంద్రీకరించి ఓటర్లను ఆకర్షించింది. ఆశించిన విధంగానే అత్యధిక మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సర్దుపోటుకు తెరలేపటం వినియోగదారులతో పాటు ఆ పార్టీ శ్రేణులలోనూ కలవరం మొదలైంది. ఇప్పటికే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న విషయం విధితమే. తాజా పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారుల ఆగ్రహానికి గురవక తప్పదనిసుస్పష్టం. దీంతో అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.