ప్రజాశక్తి – సామర్లకోట
సామాజిక న్యాయం సమానత్వ సాధనకై ఐద్వా ఆధ్వర్యంలో 5వ జిల్లా జాతా శుక్రవారం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్.రమణి, జిల్లా కార్యదర్శి కె.వరలక్ష్మి మాట్లాడుతూ నేటికీ దేశంలో సామాజిక న్యాయం లేదని, కుల, మహిళా వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. స్త్రీ పురుష సమానత్వం కోసం మహిళలందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు సాధికారత సాధించాలంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం రావాలని అన్నారు. ఫూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు వంటి మహానీయులను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.గంగభవాని, దుర్గభవాని, భూలక్ష్మి, కె.అరుణ, పిబిఎ.ప్రభావతి, స్థానిక మహిళలు పాల్గొన్నారు.