రసాభాసగా సామాజిక తనిఖీ సభ

Jan 7,2025 23:26
సామాజిక తనిఖీ సభ రసాభాసగా మారింది.

ప్రజాశక్తి – ప్రత్తిపాడు

మండలంలోని లంపకలోవ గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం నిర్వహించిన సామాజిక తనిఖీ సభ రసాభాసగా మారింది. మంగళవారం గ్రామ సర్పంచ్‌ పంది మణికుమారి అధ్యక్షతన డిఆర్‌పి శ్రీరామమూర్తి గ్రామసభను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో సుమారు రూ.40 లక్షలతో 30 పనులు, పంచాయతీ రాజ్‌ నిధులు రూ.8.19 లక్షలతో జరిగిన పనులపై ఈనెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఆడిట్‌ బృందం తనిఖీ చేసిందని తెలిపారు. కర్రి వాని చెరువు పనుల్లో రూ.31 వేలు అదనంగా వేతనాలు చెల్లించారని, మొత్తం 576 మస్తరు కాగితాలు ఉపయోగంచగా, మస్తర్లలో దిద్దుబాట్లు, ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకరే వేలుముద్రలు వేసినట్టు గుర్తించినట్లు తెలిపారు. చేసిన పనులకు సంభందించి ఒక్కటి కూడా శిలాఫలకాలు ఏర్పాటు చేయలేదని, కొబ్బరి మొక్కల పెంపకంలో రూ.23 వేలు దుర్వినియోగమైనట్టు గుర్తించినట్లు తెలిపారు. ఉపాది పనులకు పంచాయతీ తీర్మానాలు లేవని ప్రతీ 3వ శుక్రవారం నిర్వహించాల్సిన సమావేశాలు జరగలేదని, పూర్తి స్థాయిలో రిజిస్టర్ల నిర్వాహణ జరగలేదని ఆయన వివరించారు. పనుల్లో జరిగిన అవకత వకలపై సర్పంచ్‌ పంది మణికుమారి, స్థానికులు చక్కపల్లి బూరయ్య, సమ్మిటి అమ్మిరాజు, చక్కపల్లి మందేశ్వరరావు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో టిడిపిలోని రెండు గ్రూపులకు చెందిన వారు ఒకరిపై వాదోపవాదనలకు దిగారు. దీంతో ఎస్‌ఐ లక్ష్మీకాంతం జోక్యం చేసుకుని ఇరువర్గాలను వారించారు. ఈ సమావేశంలో కార్యదర్శి బి.వీరబాబు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.

➡️