అన్నదాతకు ఆరాధ్యుడు కాటన్‌ దొర

May 15,2024 22:21
అపరభగీరధుడుగా కీర్లింపపడుతున్న

అపరభగీరధుడుగా కీర్లింపపడుతున్న సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతిని జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిట్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గోదావరి ఉన్నంత వరకూ గోదావరి జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా కాటన్‌ ఉంటారని కొనియాడారు.

ప్రజాశక్తి – యంత్రాంగం
కాకినాడలో..జెఎన్‌టియుకె ప్రాంగణంలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, కాకినాడ లోకల్‌ సెంటర్‌ భవనంలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెఎన్‌టియుకె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ కాకినాడ లోకల్‌ సెంటర్‌ మరియు రిటైర్డ్‌ ఇరిగేషన్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ (ఆరఇఎకె)ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎల్‌.సుమలత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ కాకినాడ లోకల్‌ సెంటర్‌ ఛైర్మన్‌, స్కూల్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమలత మాట్లాడుతూ భావి ఇంజనీర్లు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ధవళేశ్వరం వద్ద ఆర్థర్‌ కాటన్‌ నిర్మించిన బ్యారేజీ వలన గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అయ్యాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలోనే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టడం ముదావహమన్నారు. రిటైర్డ్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఎన్‌. అర్జునరావు మాట్లాడుతూ కాటన్‌ దార్శనికతను, సేవా తత్పరతను ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ కాకినాడ లోకల్‌ సెంటర్‌ సెక్రటరీ డాక్టర్‌ వి.జయప్రసాద్‌ కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ కాకినాడ లోకల్‌ సెంటర్‌ సెక్రటరీ డాక్టర్‌ వి.జయప్రసాద్‌, ఆర్‌ఇఎకె ప్రెసిడెంట్‌ ఇంజనీర్‌ ఎన్‌.కృష్ణారావు, సెక్రటరీ ఇంజనీర్‌ వి.కృష్ణారావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌లో..

బ్రిటిష్‌ పాలకుడైన కాటన్‌ మహాశయుడు అన్నదాతకు ఆరోగ్యంగా గుర్తింపబడ్డారని ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి ఎస్‌.శ్రీ నగేష్‌ అన్నారు. బుధవారం బోట్‌ క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వర్యంలో కాటన్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1803 మే 15న కాటన్‌ జన్మించారని అన్నారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను దక్షిణ ప్రాంతానికి కాలువల శాఖకు ఇంజనీరుగా నియమించిందని గుర్తు చేశారు. 19వ శతాబ్దంలో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించారని కొనియాడారు. అందుకే ఆయనను ఇప్పటికీ అపర భగీరథుడిగా డెల్టా వాసులు కీర్తిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్‌, రాఘవరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

గండేపల్లిలో..

మండలంలోని సూరం పాలెం ఆదిత్య యూని వర్సిటీ క్యాంపస్‌లో సర్‌ ఆర్థన్‌ కాటన్‌ 221వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్‌ ఆర్థన్‌ కాటన్‌ విగ్రహానికి ఆదిత్య యూనివర్సిటీ డిప్యూటీ ప్రోఫెసర్‌, ఛాన్సలర్‌ డాక్టర్‌ మేడపాటి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డొక్కల కరవుతో డెల్టావాసులు పొట్టచేత పట్టుకుని వలసలు పోయే పరిస్థితుల్లో.. బీడు భూములను బంగారం పండే మాగాణులుగా మార్చిన మాంత్రికుడు కాటన్‌ అని కొనియాడారు. నీటితో నేలరాతను మార్చి అన్నదాతగా మారిన అపర భగీరథుడుగా కాటన్‌ నిలిచారని అన్నారు. ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి జిల్లాల వాసులకు నిత్య స్వరణీయుడని అన్నారు. తెలుగు జాతితో నిత్యం పూజలందుకుంటున్న మహనీయుల్లో తొలి వరసలో కాటన్‌ ఉన్నారని అన్నారు. గోదావరి ఉన్నంతవరకూ గోదావరి జిల్లా వాసుల హృదయాలలో కాటన్‌ నిలిచిపోతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్‌ లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.సత్యనారాయణ, ప్రోఫెసర్‌ డాక్టర్‌ టి.నరేంద్రుడు, గ్రంథాలయ విభాగాధిపతి కె.అశోక్‌కుమార్‌, తోటకూర గంగాధర్‌, బల్లా సూర్యారావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సామర్లకోటలో..

గోదావరి జిల్లాలను అన్నపూర్ణగా మార్చిన అన్నదాతగా పేరుగాంచిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి కార్యక్రమం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గోదావరి కాలువను ఆనుకుని ఉన్న కాటన్‌ దొర విగ్రహానికి రైతు సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి రూ.10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన గొప్ప దార్శినికులని కాటన్‌ ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతు నాయకులు పాల్గొని కాటన్‌కు ఘనంగా నివాళి అర్పించారు.

తాళ్లరేవులో..

ఉభయగోదావరి జిల్లాల ఆశాజ్యోతి సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి కార్యక్రమం పి.మల్లవరం, పత్తిగొంది పంట కాలువ వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, టేకుమూడి ఈశ్వరరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం కావడానికి కాటన్‌ దొర బ్రిటిష్‌ వారిని ఒప్పించి ధవలేశ్వరం వద్ద ఆనకట్ట కట్టించడం వల్ల ఉభయగోదావరి జిల్లాలు అన్నపూర్ణగా మారాయని అన్నారు. ఇక్కడ పండిన పంటలు దేశంలో ప్రజలకే కాకుండా ఇతర దేశాల ప్రజలకు ఆహార ధాన్యాలు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలకు తిండిగింజలతోపాటు ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులే కాకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధి జరిగిందన్నారు. నిరంతరం కాటన్‌ మహాశయుని స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దున్న గంగరాజు, దుప్పి అదృష్టదీపుడు, తాతపూడి రాజారత్నం, ఎలిపే నాగేశ్వరావు, నల్లి ఈశ్వరరావు, కుంచె భీమాజీ, కొండమూరు శివయ్య, కుంచె అప్పన్న పాల్గొన్నారు.

➡️