పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

May 12,2024 22:41
సార్వత్రిక ఎన్నికలు 4వ దశ పోలింగ్‌కు

ప్రజాశక్తి – పిఠాపురం

సార్వత్రిక ఎన్నికలు 4వ దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఆర్‌ఒ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో 132 లొకేషన్లలో 242 పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుం దన్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 2,36,409 మంది ఓటర్లు ఉన్నారని వారిలో 1,18,183 మంది పురుషులు, 1,18,183 మంది మహిళలు, ఇతరులు 3 ఓట్లు ఉన్నాయని అన్నారు. ఎన్నికల విధులకు 308 మంది పిఒలు, 314 మంది ఎపిఒలు, 1188 మంది ఒపిఒలు, 22మంది సెక్ట్రోరల్‌ అధికారులు, 80 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ విధులకు హాజరవ్వుతున్నారన్నారు. 227 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఉంటుందని నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రలను 22 రూట్లుగా విభజించామన్నారు. 71 క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేందుకు 300మంది పోలీస్‌, స్పెషల్‌ పోలీస్‌ సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీపట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. పోలింగ్‌ సామాగ్రి పంపిణీ ప్రక్రియను ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ గణేషన్‌ పరిశీలించారు. సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి అందించే భోజనాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్‌ సిబ్బందిని ప్రత్యేక బస్సులలో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఇవేనియోజకవర్గంలోని మూడు పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలుగా ఎన్నికల అధికారులు తీర్చిదిద్దారు. స్థానిక రాజీవ్‌ గాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలోని 155వ పోలింగ్‌ స్టేషన్‌ను ఆదర్శ పోలింగ్‌ స్టేషన్‌గా, బాప్టిస్ట్‌ చర్చ్‌ మున్సిపల్‌ పాఠశాలలోని 157వ పోలింగ్‌ స్టేషన్‌ ను పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌ (మహిళ ఓటర్లు అధికం)గా, ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని కొనపాప పేటలోని 182వ పోలింగ్‌ స్టేషన్‌ను దివ్యాంగుల ప్రత్యేక పోలింగ్‌ స్టేషన్‌గా సిద్ధం చేశారు.

➡️