సత్యదేవుని కళ్యాణ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

May 16,2024 22:43
అన్నవరం వీర వెంకట

ప్రజాశక్తి – అన్నవరం

అన్నవరం వీర వెంకట సత్యనారాయణ కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ఇఒ కె.రామచంద్ర మోహన్‌ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 18 వైశాఖ శుద్ధ దశమి శనివారం నుంచి 24 బహుళ పాద్యం శుక్రవారం వరకు నిర్వహించే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాలతో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 18వ తేదీన స్వామిని పెళ్ళికొడుకు అలంకరణతో ఉత్సవాలు ప్రారంభిస్తామని చెప్పారు. 19వ తేదీ రాత్రి 9:30 గంటలకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద స్వామి అమ్మ వార్లకు కళ్యాణం ఘట్టం జరుగుతుందన్నారు ఈ ఘట్టాన్ని వీక్షించే భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, ఎల్‌ఇడి స్క్రీన్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ముత్యాల తలంబ్రాలు 10 వేల ప్యాకెట్లు రెండు కౌంటర్లు ద్వారా పంపిణీ చేయనున్నామన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా కొండపైన కొండ దిగున సంప్రదాయంగా ఉండే వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన ప్రత్యేకంగా తయారు చేసిన నలభై అడుగుల టేకు రథంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌ రమేష్‌బాబు, అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాథరాజు, పిఆర్‌ఒ దామెర్ల కృష్ణారావు పాల్గొన్నారు.

➡️