వన్నెపూడి ఉదంతంపై ఆరా

Jun 9,2024 23:24

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

‘పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని వన్నెపూడిలో ఇటీవల జరిగిన ఉదంతం పార్టీ దృష్టికి వచ్చింది. ఆ సంఘటనపై వివరాలను సేకరిస్తున్నాం. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు’ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు స్పష్టం చేశారు. వన్నెపూడిలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆదివారం ప్రజాశక్తిలో ‘వర్మ వర్సెస్‌ జనసేన’ శీర్షిక పేరుతో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ మేరకు నాగబాబు ఓ ప్రకటనను విడుదల చేశారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన సంఘటన గురించి కూడా పిఠాపురం కో ఆర్డినేటర్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌ నేతృత్వంలోని స్థానిక నాయకులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారన్నారు. జన సైనికులంతా సంయమనం పాటించాలని కోరారు. పవన్‌ కళ్యాణ్‌ ఎన్‌డిఎలో కీలక భూమిక పోషిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చక్కబెట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని, చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం, ఇంకో వారం రోజుల్లో పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం రానున్నారన్నారు. కో ఆర్డినేటర్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌ పిఠాపురంలో అందరికీ అందుబాటులో ఉంటారన్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండే విధంగా పిఠాపురంలో జనసేన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే అందరం కూర్చొని పరిష్కారం అయ్యేవిధంగా ప్రణాళికలు రూపొందించుకుందామని జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

➡️