పింఛను కోసం ఎదురుచూపులు

Apr 13,2025 22:48
వేలాది మంది అర్హులు ఎదురుచూస్తున్నారు.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల మంజూరు కోసం వేలాది మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించకపోవడంతో పేద, సామాన్య వర్గాలకు చెందిన వీరంతా అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. 2023 నవంబర్‌ తర్వాత వెబ్‌ సైట్‌ తెరుచుకోని కారణంగా పాట్లు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పైనే కావస్తున్నా పింఛనుదారుల సమస్యలను పట్టించుకోవడం లేదు.జిల్లాలో ఒఎపి పెన్షన్లు 1,30,826 ఉండగా వీరికి రూ. 53,27,24,000, వితంతువులు 73725 మందికి రూ.30,63,48,000, వికలాంగులు 34716 మందికి రూ.21,19,14,000, ఒంటరి మహిళలు 7795 మందికి రూ.3,21,52,000, మత్స్యకారులు 6236 మందికి రూ.2,59,60,000, కల్లుగీత 3378 మందికి రూ.1,38,80,000, చేనేత 3411 మందికి రూ.1,37,88,000, ఆరోగ్య సిబ్బంది 783 మందికి రూ.89,41,000, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు 1843 మందికి రూ.76,20,000, డప్పు కళాకారులు 1568 మందికి రూ.64,04,000, సికెడియు ప్రయివేటు 361 మందికి రూ.38,90,000, అభయహస్తం 6053 మందికి రూ.31,05,000, సికెడియు ప్రభుత్వం 119 మందికి రూ.12,10,000, ట్రాన్స్‌ జెండర్స్‌ 108 మందికి రూ.4,60,000, కళాకారులు 96 మందికి రూ.3,88,000, సైనిక్‌ వెల్ఫేర్‌ పెన్షన్లు 18 మందికి రూ.90,000, అమరావతిలో భూములు లేని ముగ్గురికి రూ.15,000, మొత్తంగా 2,71,039 మందికి రూ.116 కోట్ల 88 లక్షల 89 వేలు పెన్షన్లు ప్రతీ నెలా జిల్లాలో పంపిణీ చేయబడుతున్నాయి.వేలమంది ఎదురు చూపులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా కొత్త పింఛన్‌ ఒక్కటి మంజూరు కాలేదు. దీంతో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. దాదాపు సంవత్సన్నర కాలంగా వెబ్‌సైట్‌ తెరుచుకోని కారణంగా కొత్త పెన్షన్లు మంజూరు సాధ్యం కావడం లేదు. దీనిపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రెండు, మూడు నెలల వ్యవధిలోనే కొత్త పెన్షన్లు మంజూరుకు అవకాశం ఉండేది. అయితే వివిధ కారణాలతో లబ్ధిదారులు కోత పెట్టేవారు. వితంతు పింఛన్ల విషయంలో భర్త చనిపోయిన తర్వాత డెత్‌ సర్టిఫికెట్‌ సచివాలయంలో సమర్పించిన కొద్ది నెలలకే పింఛన్‌ మంజూరు చేసేవారు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. భర్త చనిపోయి ఏడాది, రెండేళ్లు కావస్తున్నా ఇంకా పింఛన్లు మంజూరు కావడం లేదు. అలాగే వృద్ధుల పింఛన్లు మంజూరు కాక అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. కనీసం మందుల ఖర్చుకైనా పింఛన్‌ డబ్బులు పనికొస్తాయని ఆశిస్తుంటే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతీ నియోజకవర్గంలోనూ వేలాది మంది కొత్త పింఛన్ల మంజూరు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 5 వేల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు పిఠాపురం మండలం కందరాడలో వృద్ధాప్య పింఛన్‌ కోసం నెలల తరబడి పందుల కామరాజు తిరుగుతున్నాడు. ఇదే గ్రామంలో ఉప్పలపాటి భావన్నారయణ, సారా సుబ్బారావుదీ ఇదే పరిస్థితి. ఫక్రుద్దీన్‌ పాలెం గ్రామానికి చెందిన ముమ్మిడివ రాంబాబు ఏడాది క్రితం మరణించగా భార్య వెంకట లక్ష్మీకి, రంగనాధం జయబాబు భార్య రత్నంకు, మాసా సూర్యకాంతంకు వితంతు పెన్షన్‌ రావడం లేదు. ఇదే గ్రామానికి చెందిన వందే శాంతి కుమారుడు ప్రసాదరావు వికలాంగ పెన్షన్‌ కోసం అనేకసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. నరశింగపురంలో రాయుడు సత్యనారాయణ, పిఠాపురం పట్టణంలోని 4వ వార్డుకి చెందిన చింతపల్లి సత్తిబాబు మూడేళ్ల క్రితం మరణించగా లక్ష్మి సచివాలయం చుట్టూ తిరుగుతున్నా సాంకేతిక కారణాల చూపుతున్నారు. కాకినాడ రూరల్‌ రాయుడుపాలెంలో రాయుడు లోవకుమారి, పి.సూర్యకాంతం, బీరా దయామణి, రౌతులపూడి మండలం బలరామపురంకు చెందిన లవుడు దేవుడమ్మ తదితరులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

➡️