ప్రజాశక్తి – కాజులూరు
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించిన ఉచిత మెడికల్ శిబికరాన్ని ఆయన ప్రారంభించారు. రామచంద్రపురం జనసేన ఇన్‌ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, అన్యం శ్రీరామ్ సారధ్యంలో తాళ్లరేవుకి చెందిన సూర్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, వైద్యులు డాక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. వేసవి దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రణాళిక బద్ధంగా ఆరోగ్య మిషన్ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు బోండా వెంకన్న, చోడిశెట్టి శ్రీనివాస్, రెడ్డి శేషారావు, తదితరులు పాల్గొన్నారు.