ప్రజాశక్తి – కాకినాడ
పోర్టుకు వివిధ రకాల వస్తువులను రవాణా చేసే లారీ యజమానులను ఒక మాఫియాగా చిత్రీకరిస్తూ వివిధ మాధ్యమాల్లో చేస్తున్న దుష్పచారం తగదని పలువురు లారీ యజమానులు అన్నారు. బుధవారం నగరంలోని సంజరునగర్‌లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద లారీ యజమానులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శీనువాసరావు, కార్యదర్శి అల్లంరాజు, కోశాధికారి గణేశుల వాసు మాట్లాడుతూ కాకినాడ పోర్టుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను రానివ్వకుండా అడ్డుపడుతున్నట్లు, లారీ యజమానులను ఒక మాఫియాగా ప్రచారం చేయడం ఆవేదనకు గురి చేస్తుందన్నారు. లారీల నిర్వహణ చాలా భారంగా మారిందని, ఒక లారీపై నాలుగు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. 1961 నుంచి ఈ అసోసియేషన్ నిర్వహిస్తున్నామని, నాటి నుంచి నేటి వరకు పోర్టుకి లారీ యజమానులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చామని అన్నారు. తమపై చేస్తున్న దుష్ప్రచారంలో ఎటువంటి నిజం లేదన్నారు.