పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు

Apr 3,2024 22:18
పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిగడచిన ఐదేళ్ల తర్వాత సార్వత్రిక ఎన్నికల నిబంధనలు కారణంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిలిపివేశారు. ప్రతి నెలా క్రమం తప్పక ఒకటో తేదీనే పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులు ఈ నెల మూడో తేదీ బుధవారం నుంచి అందుకుంటున్నారు. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడం, బ్యాంక్లకు వరస సెలవులు రావడం కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే తొలి రోజు బ్యాంకుల్లో ఆలస్యంగా క్రెడిట్‌ అవ్వడంతో బుధవారం పింఛన్ల సొమ్ముల పంపిణీలో జాప్యం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలో 445 గ్రామ, 175 వార్డు సచివాలయాలుండగా 2 లక్షల 81 వేల 378 మంది 16 రకాల పింఛను లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.75.77 కోట్లు పంపిణీ అవుతోంది. వీరిలో 70 శాతం మంది వృద్ధులు, వికలాంగులు, పలు రకాల వ్యాధులతో బాధ పడుతున్న వారు ఉండగా 10 శాతం మంది మంచం పైనుంచి లేవలేని వారు ఉన్నారు. అంతేకాక డయాలసిస్‌తో బాధ పడుతూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని వారు కూడా ఎక్కువమంది ఉన్నారు. మరొకరి సహాయం లేకుండా అడుగు తీసి అడుగు వేయలేని ఇంకొందరున్నారు. వీరంతా ఇప్పటివరకు ప్రతి నెలా ఇంటి వద్ద పెన్షన్‌ సొమ్ములను అందుకున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న యంత్రాంగం రెండు కేటగిరీలుగా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న రోగులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛను అందిస్తున్నారు. ప్రతీ సచివాలయం పరిధిలో ఒక ఉద్యోగి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లనున్నారు. మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ మొదలు పెట్టారు.లబ్ధిదారులకు తప్పని పడిగాపులుబుధవారం ఉదయం 10 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా పెన్షన్‌ సొమ్ములు పంపిణీ కావలసి ఉంది. అయితే ప్రభుత్వం సహాయ బ్యాంకులకు ఆలస్యంగా సొమ్ములు క్రెడిట్‌ చేయడంతో కొన్నిచోట్ల ఉదయం 12 గంటల తర్వాత మొదలు పెట్టారు అనేక సచివాలయాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత సొమ్ములు పంపిణీ మొదలు పెట్టారు. బుధవారం ఉదయం నుంచే ఇస్తారని ప్రచారం జరగడంతో మండుటెండలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛను కోసం సచివాలయాల గుమ్మం వద్ద ఎదురుచూపులు తప్పలేదు. ఏ సమయంలో ఇస్తారో స్పష్టమైన సమాచారం తెలియక గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో కొన్నిచోట్ల సిబ్బంది టెంట్లను, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అయితే ఎటువంటి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కనీసం కూర్చోవడానికి కూడా చోటు లేక గంటలు తరబడి నిలబడే వద్ధులు, వితంతువులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.పిఠాపురం పట్టణంలోని రాజుగారి కోట ప్రాంగణంలో ఉన్న 14 సచివాలయంలో 24, 25 వార్డులకు సంబంధించి 275 పింఛన్లు లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతి నెలా రూ.8 లక్షల 37,500 సొమ్మును అందిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు సొమ్ము క్రెడిట్‌ అవగా అప్పటి నుంచి ఐదుగురు సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం వరకు సుమారు 150 మందికి అందజేశారు. పట్టణంలోని మూడో సచివాలయంలో 363 పెన్షన్లకు గానూ ఇప్పటి వరకు 120 మందికి ఇచ్చారు. రెండో సచివాలయంలో 466కి 275 పంపిణీ చేసారు. మండలంలోని చిత్రాడ 2 సచివాలయం పరిధిలో 525 మంది లబ్ధిదారులున్నారు. వీరందరికీ రూ.15.46 లక్షలు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత క్రెడిట్‌ అవ్వడంతో ఇప్పటి వరకూ సుమారు 40 మందికి మాత్రమే ఇచ్చారు. ఐదుగురు సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. సర్వర్‌ ఇబ్బందులు లేకపోతే సకాలంలో పంపిణీ చేస్తామని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. ఈ సచివాలయాల పరిధిలో తొలి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురికి ఎదురుచూపులు తప్పలేదు. ఇలా తొలిరోజు 28.03 శాతం అంటే మొత్తం పెన్షన్స్‌లో 79,638 మందికి పంపిణీ చేశారు.రాజకీయ విమర్శనాస్త్రాలుఅవ్వా తాతలపై కక్షకట్టిన చంద్రబాబు అంటూ అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఐదేళ్లుగా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేస్తుండగా చంద్రబాబు నిర్వాకంతో వద్ధులు, వికలాంగులు పడరాని పాట్లు పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మండుటెండలో పండుటాకులు పడుతున్న ఇబ్బందులు కనబడడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విపక్షాలు సైతం అధికార పార్టీ విమర్శలను ఖండిస్తూ ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి క్రింద స్థాయి వైసిపి లీడర్‌ వరకు గోబెల్‌ ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

➡️