రూ.10 కోట్లతో బయోమెథనేషన్‌ ప్లాంట్‌

Jun 11,2024 22:50
తడి చెత్త నుంచి సిఎన్‌జి

ప్రజాశక్తి – కాకినాడ

తడి చెత్త నుంచి సిఎన్‌జి గ్యాస్‌ను ఉత్పత్తిచేసే బయోమెథనేషన్‌ ప్లాంట్‌ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ చొల్లంగి గ్రామంలో 6.45 ఎకరాల విస్తీర్ణంలో ఈ బయోమెథనేషన్‌ ప్లాంట్‌ నిర్మాణమవుతుందన్నారు. తడిచెత్త నుంచి సిఎన్‌జి గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు సంబంధించి హెచ్‌ఆర్‌ స్క్వేర్‌ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చామన్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ సమస్యలు, ఇతర అంశాలను సత్వరమే పరిష్కరించి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు 40 టన్నుల తడిచెత్తను ప్రోసెసింగ్‌ చేసి దాని ద్వారా గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఈ ప్లాంట్‌ ఏర్పాటవుతుందన్నారు. ఈ సందర్భంగా బయోమెథనేషన్‌ ప్లాంట్‌ నిర్మాణ పనుల ప్రగతిపై అక్కడి అధికారులు, కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులతో కమిషనర్‌ చర్చించారు. ఈ పర్యటనలో డిఇ రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️