గుండె వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

Sep 29,2024 21:38
అధినేత డాక్టర్‌ బిహెచ్‌పిఎస్‌.వీర్రాజు

ప్రజాశక్తి – కాకినాడ

గుండె వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరమని సూర్య గ్లోబల్‌ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ బిహెచ్‌పిఎస్‌.వీర్రాజు అన్నారు. ఆదివారం ప్రపంచ గుండె వ్యాధి భద్రత దినోత్సవం సందర్భంగా ఆయన సూర్య గ్లోబల్‌ ఆసుపత్రిలో ఉచిత పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా ర్యాలీ నిర్వహించి గుండె వ్యాధులు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. సరైన సమయ పాలన, ఆహారం తీసుకుని, ఒత్తిడి లేకుండా జీవనం సాగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 శాతం మంది గుండె సంబంధిత వ్యాధుల పట్ల మరణిస్తున్నారని అన్నారు. గుండె వ్యాధి నిపుణులు డాక్టర్‌ యు.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ఒత్తిడి లేకుండా సుగర్‌, అధిక రక్తపోటును ఆధీనంలో ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎస్‌ఎన్‌ పాండా, ఆసుపత్రి ఎఒ రాజా, వివిధ విభాగాలకు చెందిన ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో కార్డియాలజీ విభాగ వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డియోథొరాసిక్‌, వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆర్‌డి.నాయక్‌ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వృద్ధులలోనే కాకుండా యువతలో గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోందన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం ఇందుకు ప్రధాన కారణాలు అన్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్‌ ప్రణవ్‌, డాక్టర్‌ మాతా శ్రీనివాస్‌, డాక్టర్‌ నరేష్‌ కూరాకుల మాట్లాడుతూ శారీరక శ్రమ లేకపోవడం గుండె జబ్బులకు ప్రధాన కారణమన్నారు. వాకింగ్‌, జాగింగ్‌ లేదా సైక్లింగ్‌ వంటి 30 నిమిషాల శారీరక శ్రమను ప్రతిరోజూ చేయలాన్నారు. ఎక్కువ సేపు మెలకువగా ఉండడం, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. అటువంటి పరిస్థితిలో తగినంత నిద్ర (7-8 గంటలు) తీసుకోవాలన్నారు. సెంటర్‌ హెడ్‌ సుభాకరరావు మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి అయిన ఆరోగ్య పరీక్షలు చేపించుకోవడం ముఖ్యమన్నారు. మెడికవర్‌ హాస్పిటల్స్‌లో వివిధ రకాల పద్ధతుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.

➡️