ప్రజాశక్తి – సామర్లకోట
ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంగళవారం జడ్‌పి బాలికోన్నత పాఠశాల ప్లస్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు నగదు పురస్కారాలు అందించి అభినందించారు. హైస్కూల్ ప్లస్ స్థాపించిన రెండో సంవత్సరంలోనే అత్యంత మంచి ఫలితాలు సాధించి, విద్యార్థునులు విజయకేతనం ఎగరవేశారని హెచ్‌ఎం యు.మీనామాధురి అన్నారు. 70 శాతం ఉత్తీర్ణత శాతంతో జిల్లా స్థాయిలో సామర్లకోట బాలికోన్నత పాఠశాల ప్లస్ రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇంటర్లో నూతలపాటి శ్రీమాన్విత 848 /1000 సాధించి మొదటి స్థానంలో, సిహెచ్ శ్వేత 843/1000 మార్కులతో రెండో స్థానంలోనూ, టి.హరివర్షిని పూజ 800/1000 మార్కులతో 3వ స్థానంలోను నిలిచిందన్నారు. అలాగే ఎంపిసి గ్రూపు నుంచి బత్తుల ఝాన్సీ 779/1000 సాధించి మొదటి స్థానంలో నిలవగా, జవ్వాదుల అర్చన 692/1000 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఈ విద్యార్థునులకు హెచ్‌ఎం యు.మీనామాధురి ప్రధమ బహుమతిగా రూ.2 వేలు, 2, 3 స్థానాలకు రూ.1000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. అలాగే ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టు ఉపాధ్యాయులు రూ.1000లు చొప్పున విద్యార్థునులందరికీ ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ ప్రోత్సాహలపై ఎస్‌ఎంసి ఛైర్మన్ పి.భవాని, వైస్ ఛైర్మన్ పి.లోవరాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.