ప్రజాశక్తి-ఏలేశ్వరం మూసివేసిన జీడి పిక్కల ఫ్యాక్టరీని తెరిపించి తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ శుక్రవారం చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులు ఉరి తాళ్లతో నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ మూసివేసి 28 రోజులు గడుస్తున్నా యాజమాన్యం, ప్రభుత్వం గానీ కనీసం స్పందించలేదన్నారు. ఫ్యాక్టరీ మూసివేయడంతో 24 గ్రామాలకు చెందిన 409 మంది కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.వీరబాబు, గోవింద్, కృష్ణారావు, ధర్మాజీ, ఒ.దుర్గాప్రసాద్, గోపి, లోవరాజు, శివ, జయలక్ష్మి, అన్నపూర్ణ, దుర్గ, చంటి, శివలక్ష్మి తదితరులు ఉన్నారు.