న్యాయస్థానాల ఆదేశాలు భేఖాతరు అయ్యాయి. భోగి రోజు ఉదయం నుంచే పందెం కోళ్లు కత్తులు దూశాయి. బరుల వద్ద ప్లడ్ లైట్స్, ఎల్‌ఇడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం ప్రత్యేకంగా ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలోనూ సోమవారం కోడి పందేల యథేచ్ఛగా జరిగాయి. బరుల నిర్వహణలో టిడిపి, జనసేన నాయకులు పోటీలు పడ్డారు.
ప్రజాశక్తి – యంత్రాంగం
పిఠాపురం డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందేలు యథేచ్ఛగా కూటమి పార్టీల నేతల కనుసన్నల్లో జోరుగా ప్రారంభం అయ్యాయి. పిఠాపురం పట్టణ, మండలంలో కోడి పందేలు యథేచ్ఛగా జరిగాయి. బరుల చుట్టూ ఫెన్సింగ్, ప్లండ్ లైట్స్, ఎల్‌ఇడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. స్థానిక వైఎస్‌ఆర్ గార్డెన్స్‌లో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన బరిలో నిర్వహించిన కోడి పందేలను ఎంపి తంగెళ్ల ఉదరుశ్రీనివాస్ వీక్షించారు. టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బరిని మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎస్.వర్మ ప్రారంభించారు. కోడి పందేలతోపాటు, గుండాట బోర్డులను ఏర్పాటు చేశారు. పందేలను తిలకించేందుకు పిల్లలతోపాటు, తల్లులు బరుల వద్దకు రావడం విశేషం. ఎఫ్‌కె పాలెం గ్రామంలో బరి వద్ద టిడిపి, జనసేన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వైఎస్‌ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన బరి విషయంలో టిడిపి, జనసేన మధ్య వివాదం రేగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. యు.కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి, వాకతిప్ప, నాగులపల్లి, కొండవరం తదితర గ్రామాల్లో కోడిపందేలు, గుండాట యథేచ్ఛగా జరిగాయి. వాకతిప్ప గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగానే కోడి పందేలు, గుండాట నిర్వహించారు. గత వారం రోజులుగా పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన అధికార యంత్రాంగం ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా జూద క్రీడలు నిర్వహించినా పట్టించుకోకపోవడం విశేషం. తుని, కోటనందూరు పట్టణంతోపాటు, మండలంలోని ఉప్పరగూడెం, ఎస్.అన్నవరం, తేటగుంట, రాజుపేట ప్రాంతాల్లో ఫ్లడ్ లైట్ల వెలుగులో కోడి పందేలు, గుండాట, పేకాట వంటి జూదాలు యథే చ్ఛగా జరిగాయి. భోగి పండుగ ఒక్కరోజులోనే సుమారు 70 లక్షల పైగా ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కోటనందూరు మండలంలోని పలు గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించారు. సామర్లకోట మండల పరిధిలో అదినాతన టెక్నాలజీతో కోడిపందేలు నిర్వహించారు. జి.మెడపాడు, అచ్చంపేట, ఉండూరు, వికె.రాయపురం, పనసపాడు, జి.కొత్తూరు, చంద్రపాలెం గ్రామాల్లో భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేసి కోడిపందాలు నిర్వహించారు. జి.మేడపాడులో ఎల్‌ఇడి స్క్రీన్స్ ఏర్పాటుచేయడంతోపాటు, ఫోన్ పే ద్వారా సొమ్ములు అందజేస్తామని నిర్వహకులు ఫ్లెక్సీని ప్రదర్శించారు. శిబిరాల వద్ద జోరుగా మద్యం విక్రయాలు చేపట్టారు. వికె.రాయపురం బరి వద్ద స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఇక్కడ 11 కెవి లైన్ ద్వారా విద్యుత్‌ను వినియోగించారు. సాయంత్రం 6 తరువాత ఫ్లడ్ లైట్ల వెలుతురులో పందేలు కొనసాగాయి. పెద్దాపురం మండలంలో అన్ని గ్రామాల్లో కోడి పందేలు, గుండాట, పేకాట వంటి జూదాలు యథేచ్ఛగా జరిగాయి. పోలీసులు ఎంతగా హెచ్చరికల జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల అండదండలతో జూదాలు సాగాయనే విమర్శలు ఉన్నాయి. రౌతులపూడి మండలంలోని లచ్చిరెడ్డిపాలెం, గంగవరం, పారుపాక, ములగపూడి తదితర గ్రామాల్లో కోడిపందాలు జోరుగా నిర్వహించారు.