ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఏడాది కూడా కోడిపందేల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నేపథ్యంలో కోడిపందేల్లో పైచేయి సాధించేందుకు జనసేన, టిడిపి నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వేరువేరుగా బరులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లలో ఈ రెండు పార్టీల నేతలు నిమగమయ్యాయి. పోలీసులు, రెవెన్యూ అధికారుల హెచ్చరికలను పక్కన బెట్టి కూటమి నేతలు బరుల ఏర్పాట్లలో నిమగమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, గోపాలపురం, నల్లజర్ల, తాళ్లపూడి, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం, కాకినాడ జిల్లాలో పిఠాపురం, గొల్లప్రోలు, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, తొండంగి, కరప, కాజులూరు, కాకినాడ రూరల్, కోనసీమ జిల్లాలో మండపేట, ద్వారపూడి, అంబాజీపేట, రాజోలు, మలికిపురం, మామిడికుదురు, అయినవిల్లి, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, రామచంద్రపురం మండలాల్లో ఏటా కోడి పందేలు భారీగా జరుగుతాయి. పోటాపోటీగా ఏర్పాట్లు ఈ ఏడాది కూడా భోగి పండగ నుంచి మూడు రోజుల పాటు కోడి పందేల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు సాగిస్తున్నారు. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 బరుల్లో పందేలు జరగ్గా దాదాపు రూ.250 కోట్లు చేతులు మారాయి. ఈ సారి కూటమి నేతలు సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవడానికి కొన్ని రోజులుగా ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో బరుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి, జనసేన నాయకులు వేర్వేరుగా బరులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకల్లో టిడిపి అధికార ప్రతినిధి, మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్.వర్మ కోడి పందేలను నిర్వహించి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కొత్త సంవత్సరం కావడంతో తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే కార్యక్రమం పేరుతో పందేలు ప్రారంభించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తామే బరులను ఏర్పాటు చేస్తామంటూ జనసేన కార్యకర్తలు చెబుతున్నార. పిఠాపురం పట్టణంలో స్థానిక వైఎస్‌ఆర్ గార్డెన్‌లో టిడిపి, జనసేన వేర్వేరుగా బరుల ఏర్పాటుకు పనులు సాగిస్తున్నారు. అలాగే నిమ్మకాయల నరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురంలోనూ రెండు పార్టీల నేతలు పోటాపోటీగా పందేల నిర్వహణకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామర్లకోట మండలం వికె.రాయపురం, మేడపాడు, చంద్రంపాలెం, ఉండూరు, మాధవపట్నం తదితర గ్రామాల్లో వేర్వేరుగా బరులు సిద్ధం చేస్తున్నారు. జనసేన ఎంఎల్‌ఎ పంతం నానాజీ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ రూరల్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గలో కొత్తూరు, పెనుమర్తి, వలసపాకల, తిమ్మాపురం, రమణయ్యపేట, గైగోలపాడుల్లో బరుల కోసం స్థలాలను సిద్ధం చేశారు. రాజోలు నియోజకవర్గం లాంటి కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులతో పాటు వైసిపి నాయకులు సైతం కుమ్మక్కై బరులను ఏర్పాటు చేస్తున్నారు. మందు, విందులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటవుతున్న బరుల వద్ద మందు, విందుకు సైతం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి నిర్వహణ కోసం కొన్ని బరుల వద్ద ఇప్పటికే వేలం నిర్వహించనట్టు సమాచారం. భారీ బరువల వద్ద వేలం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఖరారైనట్టు సమాచారం. అక్కడ మద్యంతో పాటూ బిర్యానీ, ఇతర ఆహార పదార్థాలు, సిగరెట్లు, కూల్ డ్రింక్స్ వంటివి అమ్ముకునేలా వేలాలు ఖరారు చేశారు. అంతేకాకుండా కోస మాంసం చేసేందుకు, అక్కడే వండి పెట్టేందుకు సైతం నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. హైటెక్ హంగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు, కాట్రేనికోన, ఐ.పోలవరం, కాకినాడ జిల్లా తాళ్లరేవు, ముమ్మిడివరంలో భారీ బరుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మూడు రోజుల పాటు 24 గంటల పాటు పందేలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా విఐపి గేలరీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పందెం అందరికీ కనపడేలా ఎల్‌ఇడి స్క్రీన్లను సైతం ఏర్పాట్లు చేసేలా నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. ఆత్రేయపురం, రావులపాలెం, రాయవరం, కపిలేశ్వరపురం తదితర మండలాల్లో పందేలు కూర్చొని చూసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.