ప్రజాశక్తి-కాకినాడ జెఎన్‌టియుకెలో ఈ నెల 9 నుంచి జనరేటివ్ ఎఐ ఫర్ డేటా అనలిటిక్స్ అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ కెవి.రమణ, ఐక్యూఎసి ఇన్‌ఛార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంహెచ్‌ఎం.కృష్ణప్రసాద్, యుసిఇకె వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జివిఎస్‌ఆర్.దీక్షితులు, యుసిఇకె సిఎస్‌ఇ విభాగాధిపతి, వర్క్‌షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.రామకృష్ణయ్య, ఎంఎస్‌ఎంఇ ప్రతినిధి వి.స్వప్న వేదికనలంకరించగా సిఎస్‌ఇ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎన్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఎన్.ఉషాదేవి, డాక్టర్ ఎస్.సురేఖ కో ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రెక్టార్ ప్రొఫెసర్ కెవి. రమణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి వ్యవస్థాపకులుగా మారిన తర్వాత ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించవచ్చునన్నారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ఐదేళ్ల ప్రోగ్రామ్ ప్రవేశపెడుతోందని, రాష్ట్రంలోని జెఎన్‌టియుకె, ఆంధ్రా యూనివర్శిటీలకు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు అవకాశం లభించిందన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎఐ ఆధారిత నూతన ఆవిష్కరణలు చేపట్టడంతో పాటు వ్యవస్థాపకులుగా తయారు కావచ్చునన్నారు. ప్రొఫెసర్ ఎంహెచ్‌ఎం.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జెఎన్టియుకెలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఇప్పటివరకు 10 ప్రోగ్రామ్‌లను ఎఐ ఆధారిత ప్రోగ్రామ్‌లుగా రూపొందించినట్టు తెలిపారు. ప్రొఫెసర్ జివిఎస్‌ఆర్.దీక్షితులు, ప్రొఫెసర్ ఎన్.రామకృష్ణయ్య, ఎంఎస్‌ఎంఇ ప్రతినిధి వి.స్వప్న మాట్లాడుతూ మాట్లాడారు. అనంతరం వర్క్ షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు, రీసోర్స్‌పెర్సన్స్‌కు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు, అధ్యాపకులు, జెఎన్ టియుకె, అనుబంధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
