కష్టాల్లో కాంట్రాక్టు అధ్యాపకులు

Oct 29,2024 22:24
అధ్యాపకుల కష్టాలు తీరడం లేదు.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ఇంటర్‌ విద్యాబోధనలో కీలకంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల కష్టాలు తీరడం లేదు. వైసిపి ప్రభుత్వం వీరిని రెగ్యులర్‌ చేస్తామని ప్రకటించినప్పటికీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వలన ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో కూటమి సర్కారైనా తమ గోడు వినిపించుకోవాలని అధ్యాపకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 41 ఇంటర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుండగా సుమారు 10 వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. 200 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు పని చేస్తుండగా 339 మంది కాంట్రాక్టు అధ్యాపకులు విధుల్లో ఉన్నారు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ వంటి సబ్జెక్టులను ఇంగ్లీషు మీడియంలో బోధించడం కొంత కష్టతరమవడం, పోస్టులు భర్తీచేయకపోవడంతో ఒప్పంద అధ్యాపకుల ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేశారు. 2000 సంవత్సరం డిసెంబర్లో 143 జీవో ద్వారా జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల నియామకాలు చేపట్టారు. ఇంటర్మీడియట్‌లో ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌ వారి కంటే ఎక్కువగా ఉన్నారు. వారితో సమానంగా పని చేస్తున్నారు. వేసవిలో విద్యార్థుల అడ్మిషన్ల కోసం ప్రచారం చేయడం, పరీక్షలు నిర్వహించడంతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం, ప్రాక్టిల్‌ పరీక్షల నిర్వహణ, తరగతులు నిర్వహించడం వంటి కీలక బాధ్యతలన్నీ వీరే పర్యవేక్షిస్తుంటారు. జీవో 114 ద్వారా రెగ్యులర్‌ ప్రకటనజగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2023 అక్టోబర్‌ 22న జీవో నెంబరు 114 ను ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులర్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ తమ బతుకులు మారుతాయని ఆనందించారు. కానీ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అధికారుల అలసత్వంతో రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ మంద గించడంతోపాటు ఎన్నికల కోడ్‌ రావడంతో ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో అందరి ఆశలు అడియాశల య్యాయి. ఆ తర్వాత కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరూ అప్పటి సీఎం వద్ద తమ గోడు వెల్లడించగా తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే అప్పుడు అందర్నీ రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ప్రభుత్వం మారడంతో రెగ్యులర్‌ చేస్తామన్న హామీ అమలు కావడం లేదు. గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే నిమిత్తం యాక్ట్‌ 30 చట్టం చేసి 10,117 మంది కాంట్రాక్టు సర్వీస్‌ రెగ్యులరైజ్‌ చేసేందుకు 114 జీవో ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా మెడికల్‌ అండ్‌ హెల్త్‌, ఫారెస్ట్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఇరిగేషన్‌ తదితర శాఖల్లో పని చేసే 3 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కాని ఎన్నికల కోడ్‌ కారణంగా అత్యధిక మంది పని చేస్తున్న జూనియర్‌, డిగ్రీ, పాలి టెక్నీక్‌, కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు ఉత్తర్వులు విడుదల చేయడానికి కుదరలేదు. కావున చిట్ట చివరి అంకం వరకూ వచ్చి ఆగి పోయిన తమ రెగ్యులరైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అధ్యాపకులు వేడుకుంటున్నారు.ప్రభుత్వ కళాశాలల బలోపేతంలో కీలక పాత్ర2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లుగా నియమితులై పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థినీ, విద్యార్థులు అధికంగా చదువుకునే ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయడంలో వీరు కీలకపాత్ర వహిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ఏ విధమైన ఉద్యోగ భద్రత రాకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనై పలువురు మృతి చెందిన దాఖలాలు ఉన్నాయి. తమ ఉద్యోగాలు పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కు చందంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకొర జీతాలతో జీవితం నెట్టుకొచ్చే తమ పరిస్థితి ఏమిటనే బెంగతో గడుపుతున్నారు. నిబంధనల పరిమితిని మించి నాన్‌ టీచింగ్‌ వారికి లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వడం వల్ల కొంతమంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో, ఉద్యోగ భద్రత లేక కుటుంబ భారాన్ని మోయలేక తీవ్రమైన ఆర్థిక మానసిక ఒత్తిడికి లోనై విద్యా బోధన చేస్తున్నారు. ఒకపక్క ఇంటి అద్దె, పిల్లల స్కూల్‌ ఫీజులు, రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు వీరుని మరింత కుంగ దీస్తున్నాయి.

➡️