సమస్యలపై గళమెత్తిన కౌన్సిలర్లు

Nov 30,2024 22:53
కౌన్సిల్‌ వేదికగా గళమెత్తారు.

ప్రజాశక్తి – పెద్దాపురం

పట్టణ ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై కౌన్సిలర్లు కౌన్సిల్‌ వేదికగా గళమెత్తారు. సమస్యలను పరిష్కరిండంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశారు. శనివారం మున్సిపల్‌ కౌన్సిల సమావేశం ఛైర్‌పర్సన్‌ బొడ్డు తులసిమంగతాయారు అధ్యక్షతన జరిగింది. పట్టణంలో పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా జరగటం లేదని, అనేక వార్డుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, పాండవుల మెట్టపై ఉన్న శతాబ్ది పార్కు అభివృద్ధి నత్త నడకన సాగుతుందని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ అధికారులను నిలదీశారు. కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్‌, పప్పల దుర్గారావు మాట్లాడుతూ పట్టణంలో గత కొన్ని రోజులుగా మంచినీరు సక్రమంగా సరపరా కాక ప్రజలు అవస్థలు పడుతున్నా రన్నారు. పట్టణానికి గోదావరి మంచినీటి సరఫరా జరిగే సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్‌ వద్ద ఉన్న రెండు మోటార్లు చెడిపోవడంతోపాటు, పద్మనాభ కాలనీ, వరహాలయ్య పేటలలోని మంచినీటి బోర్లు పని చేయక పోవడంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యుద్ధ ప్రాతిపదికపై మరమ్మతు పనులు చేయించాల్సిన అధికారులు నిర్ల క్ష్యంగా వ్యవహరించడాన్ని వారు తప్పుబట్టారు. పాండవుల మెట్టపై ఉన్న శతాబ్ది పార్కు అభివృద్ధికి నాలుగు నెలల క్రితం కౌన్సిల్‌ రూ.25 లక్షలు కేటాయించినా పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయని నిల దీశారు. దీనిపై ఛైర్‌పర్సన్‌ తులసి మంగ తాయారు మాట్లాడుతూ తనకు కూడా మంచినీటి సమస్యపై చాలామంది ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 2వ వార్డ్‌ కౌన్సిలర్‌ ఆకుల కృష్ణ బాపూజీ మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్న లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అప్పగించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే లబ్ధిదారులకు గృహాలను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. తన వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందన్నారు. తన వార్డు పరిధిలో కల్వర్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కౌన్సిలర్‌ విడదాసరి రాజా డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వైస్‌ ఛైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ టివి.పద్మావతి, మేనేజర్‌ జ్యోతిరాణి, డిఇ ఇడిఎస్‌. ప్రకాష్‌రావు, ఎఇలు కృష్ణదేవప్రసాద్‌, ఉమామహేశ్వరి, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️