డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్

Jan 10,2025 22:53
డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, పిఠాపురం తప్పు చేస్తే క్షమించేది లేదుతప్పు చేస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భగా పిఠాపురంలోని రాజీవ్‌ గాంధీ మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో నిర్వహించిన పల్లెపండుగ వారోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకర మన్నారు. దీనికిపై టిటిడి ఇఒ, పాలకమండలి క్షమాపణ చెప్పాలన్నారు. గత పాలకులు రంగులు వేసి అదే అభివృద్ది అన్నారని విమర్శించారు. తమ హయాంలో గ్రామ సభలు నిర్వహించి రికార్డ్‌ స్థాయిలో రూ.4500 కోట్ల పనులకు అనుమతి తెచ్చామని గుర్తు చేశారు. పిఠాపురం నియోకవర్గానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా అభివృద్ధి చేస్తానన్నారు. తాను పనిచేస్తేనే తరువాత ఎన్నికల్లో గెలిపించాలని లేకుంటే ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు. ఇటీవల కాకినాడ జిల్లాలో క్రైం రేటు పెరిగిందన్నారు. పోలీసులు ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేసే వారికి ఉపేక్షించరాదన్నారు. పిఠాపురంలో మరోమారు ఈవ్‌టీజింగ్‌ మాట వినపడదన్నారు. పోలీస్‌ స్టేషన్లలో విఐపి ట్రీట్‌మెంట్లకు స్వస్తి చెప్పాలని పోలీసులకు సూచించారు. పోలీస్‌ స్టేషన్లలో లాయర్లతో సెటిల్‌ మెంట్లు పెట్టకండి అంటూ పోలీసులకు హితవు పలికారు. ప్రతి గ్రామంలోనూ త్వరలో పర్యటి స్తానన్నారు. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడిని ఇచ్చిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 6 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 12,500 మినీ గోకులం షెడ్లను నిర్మించామని తెలిపారు.కుమారపురంలో రూ.1.85 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్‌ను ఆయన ప్రారంభించారు. పాడి రైతులకు అందిస్తున్న సదుపాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను, పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన పోస్టర్‌ను పరిశీలించారు. పిఠా పురం పట్టణంలోని ఒబిఎస్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్‌ స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ స్టాల్లో పందెం పుంజు, మేకలతో పాటు పుంగనూరు ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అటవీ శాఖ స్టాల్లో ఆలివ్‌ రిడ్లీ తాబేలుతో పాటు వివిధ రకాల పక్షుల నమూనాలను తిలకించారు. ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల మరణాలకు కారణాలపై ఆరా తీశారు. అడుగడుగున ఆంక్షలే… వెనుదిరిగిన కూటమి నేతలుపవన్‌ కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. దీంతో ప్రజలతో పాటు కూటమి నాయకులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడికి అక్కడ భారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మల్లించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ట్రాఫిక్‌ను మళ్లించడంతో సామాన్య ప్రజలతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులును ఎదుర్కోవాల్సి వచ్చింది. సభ వేదిక వద్దకు వెళ్ళెందుకు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌ చల్లా లక్ష్మి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో ఆమె కింద పడిపోయారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్మ తన అనుచరులతో సభ ప్రాంగణం ముఖ ద్వారం వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. జెసి రాహుల్‌ మీనా చేరుకుని వర్మకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వర్మ తోపాటు కొద్ది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జి బి.కృష్ణంరాజు మరి కొంతమంది బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణంరాజును మాత్రమే లోనికి అనుమతించారు. దీంతో మిగిలిన వారు అక్కడ నుంచి వెనుదిరిగారు.

➡️