దిగజారుతున్న పారిశుధ్యం

Jun 9,2024 23:38
మండల కేంద్రమైన

ప్రజాశక్తి – ఏలేశ్వరం

మండల కేంద్రమైన ఏలేశ్వరం నగర పంచాయతీలో పారిశుధ్యం దిగజారుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పందులను రోడ్లపైకి వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నా హెచ్చరికలను సంబంధిత పందుల యజమానులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఒకటి, రెండు రోజులపాటు పందులను కట్టివేస్తున్నారని, తరువాత యథావిధిగా వదిలివేస్తున్నారు. దీంతో పందులు పట్టణంలో స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ పందుల వల్ల అంటు వ్యాధులు ప్రభల్లే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికితోడు ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోవడం, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండటంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పట్టణంలో నూతన డ్రెయినేజీలు నిర్మాణం చేపట్టకపోవడం పాత డ్రెయినేజ్‌లు శిధిలావ్యవస్థకు చేరడంతో వర్షాలు పడితే నీరు ఎక్కడపడితే అక్కడే నిలిచిపోయే పరిస్థితులు నెలకున్నాయి. రానున్న వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్‌, డెంగూ, వంటి అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ అధికారులు ఇప్పటికైనా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే పందులు పట్టణంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️