ఫ్యాక్టరీ తెరిపించాలని మోకాళ్లపై ధర్నా

Nov 26,2024 23:27
జీడిపిక్కలు ఫ్యాక్టరీ తెరిపించాలని

ప్రజాశక్తి – ఏలేశ్వరం, జగ్గంపేట

ఈ నెల 16 న అర్ధాంతరంగా నిలిపివేసిన చిన్నింపేట జీడిపిక్కలు ఫ్యాక్టరీ తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై కూర్చుని ధర్నా చేపట్టారు. మంగళవారం జరిగిన ఈ ధర్నాలో సిఐటియు ప్రత్తిపాడు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ మూసివేయడంతో 409 మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఫ్యాక్టరీని తెరిపించాలని గత పది రోజులుగా అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కంట చక్రధర్‌, కర్రీ రాజా, కాకర ప్రసాద్‌, వనము దుర్గాప్రసాద్‌, ఎ.రామదుర్గ, సిహెచ్‌.గోవింద్‌, వై.రమేష్‌, జి.వీరబాబు, ఎస్‌.జయలక్ష్మి, వై.శివ వరలక్ష్మి, కె.కృష్ణవేణి పాల్గొన్నారు.

ఎంఎల్‌ఎను కలిసిన కార్మికులు

చిన్నింపేట జీడిపిక్కల పరిశ్రమ కార్మికులు ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూను కలిశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ అర్థాంతరంగా పరిశ్రమను నిలిపివేయడంతో సుమారు 409 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ప్రభుత్వమే పరిశ్రమను తీసుకుని నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. దీనిపై ఎంఎల్‌ఎ మాట్లాడుతూ డిసిఎల్‌తో మాట్లాడి కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు వీరబాబు, కంట చక్రధర్‌, కాకరప్రసాద్‌, ఎ.రామదుర్గ, సిహెచ్‌.గోవిందు, జి.వీరబాబు, జయలక్ష్మి, దుర్గ, అన్నపూర్ణ పాల్గొన్నారు.

➡️