సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ

Apr 3,2024 22:20
సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ

ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ సచివాలయాల్లో జరుగుతున్న పింఛన్ల పంపిణీ ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు బుధవారం పరిశీలించారు. స్థానిక రామారావుపేట, గాంధీనగర్‌, మెయిన్‌రోడ్డు, దుగ్గిరాల వారి వీధి, పగోడా మున్సిపల్‌ స్కూల్‌ ప్రాంతాల్లోని సచివాలయాలను కమిషనర్‌ సందర్శించారు. పింఛన్‌దారులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా పింఛన్లు అందజేయాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పింఛన్‌లు అందజేస్తున్న తీరును పర్యవేక్షించి సూచనలిచ్చారు. పెద్దాపురం మండల పరిధిలోని 23 గ్రామాల్లో 11,962 మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో బుధవారం 4,911 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు ఎంపిడిఒ జి.ఉషారాణి తెలిపారు. పలు గ్రామాల్లో పింఛన్లు పంపిణీని ఆమె పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మొదటి రోజు 40 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ జరిగిందన్నారు. అనం తరం జె.తిమ్మాపురం, కట్టమూరులో ఎంపిడిఒ పింఛన్లు పంపిణీ చేశారు. కరప మండలంలో పింఛన్ల పంపిణీ 20 శాతం పూర్తి చేసినట్టు ఎంపిడిఒ కె.అప్పారావు తెలిపారు. మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో 1,176 మంది లబ్ధిదారులు ఉండగా 21 గ్రామ సచివాలయాల్లో పంపిణీకి ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం 20 శాతం పూర్తి చేసినట్లు పెన్షన్‌ లబ్ధిదారులు వచ్చి వేచి ఉన్న వారి అందరికీ సమయం దాటిపోయినా పింఛన్లు ఇచ్చి పంపించాలని సిబ్బందిని ఆదేశించినట్టు తెలిపారు. సామర్లకోట మండల పరిధిలో మొత్తం 11,957 మందికి పింఛన్లు అందించినట్టు ఎంపిడిఒ శ్యామ్‌ సుందర్‌ తెలిపారు. వికలాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వద్ధులకు పింఛన్లను ఇంటి వద్దకే అందిస్తామని, ఇతరులకు గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేపట్టినట్టు తెలిపారు.

➡️