ప్రజాశక్తి – పిఠాపురం
స్థానిక బిసి కళాశాల హాస్టల్ విద్యా ర్థులకు మాజీ ఎంపీ జివి.హర్షకుమార్ రగ్గులు పంపిణీ చేశారు. మంగళవారం ప్రజాశక్తిలో ‘వణుకుతున్న సంక్షేమం’ పేరుతో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. నేషనల్ ఒప్రెస్సెడ్ క్లాసెస్ (ఎన్‌ఒసి) ట్రస్ట్ ద్వారా వసతి గృహం విద్యార్థులకు రగ్గులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రతిరోజు ప్రజాశక్తి పేపర్ చదివే అలవాటు ఉందన్నారు. ప్రజా సమస్యలు, ఇబ్బందుల మీద ప్రచురించే పేపర్లు తక్కువైపోతున్నాయన్నారు. అనేకమంది సంక్షేమ హాస్టల్‌లో చదివి ఎన్నో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నార న్నారు. ఈ ఏడాది చలిగాలులు ఎక్కువ ఉన్నాయని, రెండు రోజుల క్రితం ప్రజాశక్తిలో సంక్షేమ హాస్టల్ లో వణుకుతున్న విద్యార్థులు వార్తను చూసి తాను చల్లించిపోయానన్నారు. తన ట్రస్ట్ ద్వార రూ లక్ష రూపాయల విలువ చేసే రగ్గులు కొని జిల్లాలో ఉన్న వివిధ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు అందించాలని అనుకున్నానని అన్నారు. అందులో భాగంగానే స్థానిక బిసి కళాశాల బాలుర వసతి గృహంలో విద్యార్థులకు రగ్గులు అందజేశామన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రతిదీ ప్రభుత్వానిదే బాధ్యత అనుకోకుండా సంక్షేమ హాస్టల్‌లో చదువుతున్న పిల్లలు మన పిల్లల్లాగే భావించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. పవన్ కళ్యాణ్ స్థానిక శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి తాను ఇక్కడికి రాలేదని పేపర్లో వచ్చిన వార్తను చూసి మాత్రమే తాను ఇక్కడకు వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో హర్షకుమార్ తయుడు శ్రీరాజ్, ఎపి మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు, బిఎస్‌పి పిఠాపురం ఇన్‌ఛార్జ్ ఖండవల్లి లోవరాజు, అంబేడ్కర్ యూత్ అధ్యక్షులు వై.సుభ్రమణ్యం, దారా వెంకట రావు, ముంజవరపు కృపానందం, మల్లం అంబేడ్కర్ యూత్ సభ్యులు, హాస్టల్ వార్డెన్ కల్పన, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు సిద్దు, ప్రకాష్, ఈశ్వర్, రాజేష్ పాల్గొన్నారు.