ప్రజాశక్తి – కాకినాడ, కాకినాడ రూరల్
చిత్తడి నేలలను పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస్‌వినీల్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జగన్నాథపురం మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరిగింది. విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహిం చారు. హెచ్‌ఎం జివిఎస్‌ఎన్. మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిత్తడి నేలలు జీవ వైవిధ్యం, పర్యావరణాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఎన్నో జీవరాసులకు, మొక్కలకు చిత్తడి నేలలు ఆవాసంగా ఉంటూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయన్నారు. ఫారెస్ట్ రెంజర్ ఎస్‌ఎస్‌ఆర్.వరప్రసాద్ మాట్లడుతూ నీటి-వనరులకు, మంచినీటికి మూలాలుగా ఉన్న చిత్తడి నేలలు భూమి ఉపరితలం నుంచి వ్యర్ధాలను వడపోస్తాయన్నారు. హెచ్‌ఎం మూర్తి మాట్లాడుతూ 1971లో జరిగిన ప్రపంచ దేశాల రాంసర్ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకృష్ణ మాట్లాడుతూ మడఅడవుల వలన తుపానుల నుంచి సముద్రతీర ప్రాంతాలకు రక్షణ ఉంటుందన్నారు. ఫారెస్టు సెక్షన్ అధికారి సింగం వీరభద్రరావు మాట్లాడుతూ చిత్తడి నేలల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ది కార్యక్రమం జిల్లా సమన్వయకర్త ఎల్.శ్రీహర్ష, నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, డి.జయశ్రీ, కెవికె.మహేశ్వరరావు, పి.సంధ్యారాణి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే కాకినాడ రూరల్ పరిధిలోని ఎన్‌టిఆర్ బీచ్‌లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎపి అటవీ శాఖ, ఎపి నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మహిళ డిగ్రీ, పిజి కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర తీర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్.వరప్రసాద్ అన్నారు. జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస్‌వినీల్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ళాశాల ప్రిన్సిపల్ కె.కరుణ, అకడమిక్ డైరెక్టర్ బిఇవిఎల్.నాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ పిఒ పి.సురేఖా దేవి, పీడీ ఎన్.సత్యవతి, ఐక్యరాజ్య సమితి అభివృద్ది కార్యక్రమం జిల్లా సమన్వయకర్త ఎల్.శ్రీహర్ష,, ఫారెస్ట్ సెక్షన్ అధికారి సింగం వీరభద్రరావు, ఎపి నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కెవికె.మహేశ్వరరావు, క్లస్టర్ కోఆర్డినేటర్ ఎన్.వీరభద్రరావు, కె.చంద్రారెడ్డి, కేసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.