సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

Mar 8,2025 22:50
చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డెక్కారు.

ప్రజాశక్తి – తాళ్లరేవు

రబీ సాగుకు అవసరమైన సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంటు, మూలపొలం, పత్తిగొంది, రాంజీనగర్‌ ప్రాంతాలకు చెందిన రైతులు ఇరిగేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు ఎవరూ కార్యాలయంలో లేకపోవడం 216వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సాగునీరు అందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని ఆదేశించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇరిగేషన్‌ అధికారులను రప్పిస్తానని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు. ప్రతి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారన్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుందన్నారు. ఈ సమయంలో సాగునీటిని సరఫరా చేయకపోవడంతో పంటను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సాగునీరు అందిస్తామని అధికారుల హామీతోనే రైతులు పంటలు వేశారని, ఈ సమయంలో అధికారులు పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఒఎన్‌జిసి, రిలయన్స్‌ వంటి పరిశ్రమలకు సాగునీరు తరలిస్తూ రైతాంగానికి అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. వెంటనే సాగునీరు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు కాకరపల్లి వెంకటేశ్వరరాజు, దంగేటి రామకృష్ణ, గంజా శ్రీనివాసరావు, మేడిశెట్టి శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, వాసంశెట్టి రామకృష్ణ, పాలెపు ఈశ్వరరావు, వైదాడి ధర్మారావు, దంతులూరి వెంకటసుబ్బరాజు, పెద్ద ఎత్తున కౌలు రైతులు పాల్గొన్నారు. సాగునీరు అందించకపోతే ఆందోళన ఉధతంసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుపంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాళ్లరేవు నీటి పారుదల శాఖ ఎఇఇ కార్యాలయం వద్ద రైతులు నిర్వహించిన రాస్తారోకోకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంట పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. శివారు ప్రాంత పొలాలకు నీరందేలా చూడాలన్నారు. సాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌, వల్లు రాజబాబు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

➡️