స్థానిక సమస్యలపై పోరాటం

Mar 8,2025 22:48
కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, తాళ్లరేవు

స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలంతా పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో రెండు రోజులపాటు సాగిన ప్రజాచైతన్య యాత్రం శనివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ సైకిల్‌ యాత్రలో పాల్గొన్నారు. మండలంలో పలుగ్రామాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరికొంత మంది స్వచ్ఛందంగా సిపిఎం బృందం వద్దకు వచ్చి సమస్యలను ఏకరువు పెట్టారు. శనివారం తాళ్లరేవు మండలం సీతారామపురం నుంచి యాత్ర ప్రారంభమైంది. మాధవరాయునిపేట, రెడ్డివారిపేట, పోలేకుర్రు, తోటపేట, తూర్పు పేట, పి.మల్లవరంలో చిన్నపేట, గ్రాంటు, నీలపల్లి తదితర గ్రామాలో యాత్ర సాగింది. మాధవరాయుని పేటకు చెందిన టి.ఆదిలక్ష్మి, కుందుర్తి చిట్టెమ్మ, కె.లక్ష్మి, నాగలక్ష్మి మాట్లాడుతూ డ్రెయినేజీ, రహదారులు, కొళాయిలు లేవని తెలిపారు. తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామన్నారు. 30 ఏళ్లుగా 60 ఎకరాల రాణి గారి భూములను సాగు చేస్తున్నప్పటికీ నేటికీ పట్టాలు ఇవ్వలేదని సాగు చేసుకుంటున్న దున్నా కొండబాబు, కన్నీటి లక్ష్మణరావు తదితర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పట్టాలు ఇప్పించాలని కోరారు. సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పోలేకుర్రు పంచాయతీ తూర్పు పేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టామని తెలిపారు. మురుగునీరు పారక దుర్వాసనలోనే జీవిస్తున్నామని పి.మల్లవరం చినపేటకు చెందిన రామకృష్ణ, దడాల ఉమామహేశ్వరి, బర్లా తలుపులమ్మ తదితరులు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మల్లవరం మీదుగా గ్రాంటు గ్రామం వెళ్లే కాలువను పత్తి గొంది వంతెన వద్ద శ్రీనివాసరావు పరిశీలించారు. కొళాయిలు లేక తాగునీరు అందట్లేని పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని బందావనం కాలనీ వాసులు కొప్పిశెట్టి లక్ష్మి, రాజేశ్వరి, పిల్ల సూర్యకాంతం, పిల్లి లక్ష్మి తెలిపారు. ఇక్కడ 20 వరకూ ఇళ్లు ఉన్నాయని, నాన్‌ లేఅవుట్‌ కావడం వల్ల సౌకర్యాలు కల్పించలేమని పంచాయతీ అధికారులు చెబుతున్నారని తెలిపారు. అనంతరం నీలపల్లిలోని అమరవీరుల స్థూపానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అనంతరం నీలపల్లిలో దళితుల శ్మశానాన్ని పరిశీలించారు. ముంపు సమస్య నుంచి శ్మశానాన్ని కాపాడాలన్నారు. ఇంజరంలో తాత్కాలిక వంతెనను పరిశీలించారు. దీనివల్ల సాగునీరు సక్రమంగా అందడం లేదని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నమని స్థానికులు వీర వెంకట సత్యనారాయణ, సత్తిబాబు తదితరులు తెలిపారు.రత్సవారిపేటను బృందం సందర్శించింది. ఇక్కడితే యాత్రను ముగించారు. ప్రజా సమస్యలపై ఉద్యమం : వి.శ్రీనివాసరావుప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని, దీనిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తాళ్లరేవు మండలంలో సాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు, ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తున్నారు తప్ప తర్వాత పట్టించుకోవట్లేదని విమర్శించారు. స్థానికంగా 10 ఎకరాల అసైన్డ్‌ భూములున్నా వాటిని పేదలకు పంచడంలో పాలకులు అడ్డుకుంటున్నారన్నారు. రత్సవారి పేటలో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. గోదావరిలో కాలుష్యం కారణంగా చేపల వేటకు దూరమయ్యారన్నారు. వారందరూ వలసకూలీలుగా మారిపోయారన్నారు. వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలకు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సైకిల్‌ యాత్రలో సిపిఎం నాయకులు ఎం.రాజశేఖర్‌, టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్‌.శీనివాస్‌, సిహెచ్‌.రమణి, డి.క్రాంతికుమార్‌, కె.సింహాచలం, టి.రాజా, జగదీశ్వరరావు, మహేష్‌, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️