ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులపై మళ్లీ భారం మోపింది. ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 మేర ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.840 నుంచి రూ.890కు చేరింది. డెలివరీ బోరు ఛార్జీలు రూ.30 కలిపి వినియోగదారులు రూ.920 చెల్లంచాల్సి ఉంది. ఆయిల్ కంపెనీలు ధరల పెంపుపై ప్రభుత్వ నియంత్రణను రద్దు చేయటంతో అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి నెలా వంట గ్యాస్‌పై క్రమం తప్పక రూ.25 చొప్పున పెంచిన విషయం విదితమే. కొంత కాలం వ్యవధి అనంతరం తాజాగా రెట్టింపు ధర పెంచడం కొనుగోలుదారులను కలవరానికి గురి చేస్తోంది. మోడీ ప్రభుత్వం తీరుపై వినియోగదారులలో అసహనం వ్యక్తం మవుతోంది. ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా చేపట్టారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 16.77 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో గృహావసరాల వినియోగదారులు 13 లక్షల మంది ఉన్నారు. మరో 2 లక్షల మంది వాణిజ్య సిలిండర్‌ల వినియోగదారులు, మిగిలిన వారు ఉజ్వల పథకం లబ్ధిదారులు ఉన్నారు. నెలలో దాదాపు 7.50 లక్షల గ్యాస్ సిలెండర్ల వినియోగం ఉంటుందని ఒక అంచనా. గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు అమాంతం పెంచేస్తున్నాయి. వంట గ్యాస్‌పై మరో రూ.50 పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వాణిజ్య సిలిండర్‌ల ధర పెంపు చిరు వ్యాపారులకు గోరు చుట్టుపై రోకలి పోటు చందంగా పరిస్థితి తయారైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గ్యాస్ ధరలు పెంచేయడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సామాన్యులు, చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..జిల్లాలోని ప్రజలపై రూ.3.75 కోట్ల అదనపు భారంజిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై నెలకు రూ.3.75 కోట్ల అదనపు భారం పడుతోంది. 2019 ఏప్రిల్ నుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అప్పుడు రూ.734 ఉండగా 2020 మార్చిలో 839, 2021 అక్టోబర్ నాటికి 930కి పెరిగింది. 2022లో మూడుసార్లు, 23లో నాలుగుసార్లు, 2024లో ఆరుసార్లు చొప్పున ధరలు పెరిగాయి. ఎన్నికల ముందు స్వల్పంగా ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి గుదిబండ మోపింది. తాజా పెంపుతో గ్యాస్ ధర రూ.890కి చేరింది. మరోవైపు సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో డెలివరీ ఛార్జీలు ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం రూ.30 మాత్రమే వసూలు చేయాలి. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రూ.50 నుంచి రూ.60 వరకూ వసూలు జరుగుతోంది.