మత్స్యకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి

May 16,2024 22:42
మత్స్యకారుల

ప్రజాశక్తి – కాకినాడ

మత్స్యకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, తక్షణమే వేట నిషేధ పరిహారం అందించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్‌ చేసింది. గురువారం సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు కాకినాడ ఏటిమొగ రోడ్‌లో కొంత మంది మత్స్యకారులను కలుసుకుని మాట్లాడారు. ఒక ప్రక్క ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే కుటుంబ జీవనం కష్టంగా ఉందని మత్స్యకారులు వాపోయారు. వేట నిషేధం మొదలైన మొదటి వారంలోనే పరిహారం అందించాలని కోరారు. బోటులో పనిచేసే వారందరికీ పరిహారం ఇవ్వాలన్నారు. ఏప్రిల్‌ 15న వేట నిషేధం ప్రారంభం అయితే నెల రోజులు గడిచినా పరిహారం ఊసే లేదన్నారు. ఎన్నికల నిబంధనలకు, మత్స్యకారుల పరిహారానికి సంబంధం లేదన్నారు. మత్స్యశాఖ అధికారిని సంప్రదించగా మత్స్యకారుల వివరాల సేకరణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని చెప్పారని తెలిపారు. 61 రోజుల జీవనానికి కేవలం రూ.10 వేలు ఇస్తారని అదీ కూడా సకాలంలో ఇవ్వకపోవడం దారుణమన్నారు. మత్స్యకారుల ప్రాణాలు పణంగా పెట్టి వృత్తి చేస్తారని, వారి కృషి వల్ల ప్రభుత్వానికి విదేశీ కరెన్సీ కూడా సమకూరుతుందన్నారు. ఇప్పటికనా అధికారులు స్పందించి తక్షణమే మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం అందించాలని లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పెరిగిన ధరలను బట్టి వేట నిషేధ పరిహారం రూ.20 వేల రూపాయల ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

➡️