భారంగా ప్రభుత్వ డిగ్రీ విద్య

Sep 30,2024 23:35
తల్లికి వందనం తదితర

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

విద్యా, వసతి దీవెనలు, స్కాలర్షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, తల్లికి వందనం తదితర పథకాలు ప్రస్తుతం ఏ ఒక్కరికి అమలు కావడం లేదు. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా డిగ్రీ చదవాలనుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజుల చెల్లింపు భారంగా మారింది. ప్రయివేటు కాలేజీల మాదిరిగానే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ ఫీజుల పేరుతో రూ. వేలల్లో వసూలు చేస్తున్నారు. అయితే ఫీజు రియంబర్స్‌మెంట్‌ వంటి పథకాలు అమలయితే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టకపోవడంతో అనేకమంది ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ట్యూషన్‌ ఫీజు పేరుతో…

జిల్లాలో తుని, తొండంగి, అన్నవరం, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, ఏలేశ్వరం, కిర్లంపూడి, కాకినాడలో పీఆర్‌, ఉమెన్స్‌, ఎంఎస్‌ఎన్‌ కళాశాలలున్నాయి. వీటిల్లో సుమారు 8 వేల మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలల్లో సైతం ట్యూషన్‌ ఫీజు పేరుతో ప్రభుత్వం రూ.వేలల్లో ఫీజులను వసూలు చేస్తుంది. గత ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రియంబర్స్‌మెంట్‌, విద్యా, వసతి దీవెన వంటి పథకాలు అమలు చేయడంతో ఇబ్బందులు ఉండేవి కావు. ప్రస్తుతం అవేమీ అమలు కాకపోవడంతో ఫీజుల భారం విద్యార్థులపైనే పడుతోంది. బిఎ గ్రూపుల విద్యార్థులు రూ.4,986, బికాం విద్యార్థులు రూ.9,635, బిఎస్‌సి ఆక్వాకల్చర్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డేటా సైన్స్‌, ఇంటర్నెట్‌ థింగ్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర కోర్సులు చదివే విద్యార్థులు రూ.11,835, బిబిఎ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు రూ.20 వేలు, బిబిఎ డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్స్‌కి రూ.16,135, బిబిఎ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌కి రూ.21,135 ఫీజుగా చెల్లించాల్సి వస్తోంది. ఈ భారం భరించలేక పలువురు విద్యార్థులు ఇంటర్‌ వరకు చదివి మధ్యలో స్వస్తి పలుకుతున్నారు. ఈ ఏడాది అడ్మిషన్లు కూడా గణనీయంగా తగ్గినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వం అధిక ఫీజుల భారాన్ని తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎటువంటి పథకాలు అమలు చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️