ఘనంగా హోమ్‌ గార్డ్స్‌ అవతరణ దినోత్సవం

Dec 6,2024 23:41
ఘనంగా హోమ్‌ గార్డ్స్‌ అవతరణ దినోత్సవం

ప్రజాశక్తి-కాకినాడ స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం 62వ హోమ్‌గార్డ్స్‌ యూనిట్‌ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎఎస్‌పిలు ఎంజెవి.భాస్కరావు, ఎస్‌.శ్రీనివాస్‌, డిఎస్‌పి కెఎసెస్‌.శ్రీనివాస్‌, ఆర్‌ఐ కె.వెంకటరావు పర్యవేక్షణలో పరేడ్‌ కమాండర్‌ కె.రాజేష్‌ నాయుడు ఆధ్వర్యాన పెరేడ్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ హోమ్‌గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన నలుగురు హోమ్‌గార్డ్స్‌, కంపెనీ కమాండర్స్‌గా ప్రమోట్‌ అయిని ఆరుగురు హోమ్‌గార్డ్స్‌కు ఎస్‌పి అభినందనలు తెలిపి మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు, సంఘ విద్రోహశక్తుల అణచివేత, ప్రకతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు పోలీస్‌ బలగాలతో పాటు సమానంగా ప్రజా రక్షణ, సమాజ శ్రేయస్సులో ముందుండి తమ సేవలను నిస్వార్థంగా ప్రజలకు అందజేయడంలో హోమ్‌గార్డుల పాత్ర ఎంతో కీలకమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, క్రైమ్‌ నియంత్రణ, సిఐడి, టాస్క్‌ ఫోర్స్‌, పోలీస్‌ అంతర్గత భద్రత పోలీస్‌ వాహనాల డ్రైవర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో భద్రత అనేక టెక్నికల్‌ విభాగాలు వంటి అనేక విభాగాల్లో తమ సేవలను అందిస్తున్నారన్నారు. డిప్యూటేషన్‌ విధానంపై వివిధ ప్రభుత్వ శాఖల్లో వీరి సేవలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. విఐపిల బందోబస్తులు, నైట్‌ బీట్స్‌, డే బీట్స్‌, కమ్యూనికేషన్‌ విభాగాల్లో వీరు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోమ్‌గార్డుల సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి ఆరోగ్య భద్రత పథకం కింద వైద్య సాయం అందించడానికి నిర్ణయించిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి, కాకినాడ ఎస్‌టిపిఒ, టౌన్‌ సిఐ, ట్రాఫిక్‌ సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు

➡️