వేట నిషేధ పరిహారం వెంటనే చెల్లించాలి

May 20,2024 22:15
మత్య్సకారులకు వేట

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

మత్య్సకారులకు వేట నిషేద పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని సిపిఎం కాకినాడ రూరల్‌ కన్వీనింగ్‌ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. సోమవారం రూరల్‌ మండలంలోని సూర్యారావుపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మత్స్యకారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేపలు గుడ్లు పెట్టే దశలో సముద్రంలో వేటాడితే మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రతిఏటా వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తున్నదని అన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇస్తున్న పరిహారం విషయంలో సందిగ్ధం నెలకొందన్నారు. వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పేరుతో మత్య్సకారులకు అందిస్తున్న పరిహారానికి సంబంధించి ఇంతవరకు మార్గదర్శకాలు జారీ కాలేదని అన్నారు. ఎప్పటికి విడుదలవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్య్సకారులకు సంబంధించిన కీలకమైన అంశంపై వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు చెందిన నేతలు పెదవి విప్పడం లేదన్నారు. వెంటనే పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో మత్య్సకారులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పర్యటనలో సింహాద్రి, సూరి, బాబులు, రాజు, అప్పన్న, రాముడు పాల్గొన్నారు.

➡️