పుట్టగొడుగుల్లా అక్రమ లే అవుట్లు

Jun 9,2024 23:37
మండలంలో ప్రభుత్వ

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

మండలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ప్రయివేటు లే-అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చాలంటే కన్వర్షన్‌ తప్పనిసరిగా ఉండాలి. అయితే కన్వర్షన్‌ జరగకుండానే అడ్డదారుల్లో లే అవుట్లను వేసి విక్రయాలను చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతోంది. అయినా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై వెనుక ముడుపులే కారణమనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మండలంలోని పొన్నాడ, మూలపేట, గోర్స, కొమరగిరి, అమీనాబాద్‌ తదితర గ్రామాల్లో అనుమతి లేని లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా ఏర్పాటు చేస్తున్న లే అవుట్‌లలో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నీ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు పలిక జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో అధికారులకు అమ్యామ్యాలు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ లే అవుట్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? లేవా? అనే దానిపై అవగాహన లేని కొనుగోలుదారులు చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు ఆ లే అవుట్లను కొనుగోలు చేసి విషయం తెలిసిన తరువాత లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేని లే అవుట్‌లో గృహాలు నిర్మింకోవాలంటే కొనుగోలుదారులే అదనంగా సొమ్ములు వేచ్చించి బెటర్‌మెంటు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అక్రమ లేఅవుట్‌లు ఏర్పాటు చేస్తున్నప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారిపై చర్యలు తీసుకోకుండా రాజకీయ వత్తిళ్లతో వారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లే అవుట్‌లో అప్పుచేసి లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే పంచాయితీకి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించాలని అధికారులు మాత్రం ఆదేశాలు జారీ చేస్తున్నారు. మండలంలోని పొన్నాడ, మూలపేటలో ఏర్పాటులో చేసిన అనుమతి లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన లే అవుట్‌లపై పొన్నాడ గ్రామ కార్యదర్శి వివరణ కోరగా లే అవుట్‌లకు ఏటువంటి అనుమతులు లేవని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు దారులకు నోటీసులు పంపామని, అలాగే వుడా (వైజాగ్‌ అర్బన్‌ డెవలప్‌ అథారిటీస్‌)కు సమాచారం అందించామన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా ఏర్పాటు చేస్తున్న లే అవుట్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడటంతోపాటు, కొనుగోలుదారులకు అవగాహన కల్పించేలా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

➡️