అర్జీలపై తక్షణమే చర్యలు

Mar 20,2025 23:21
జి.బిందుమాధవ్‌ ఆదేశించారు.

ప్రజాశక్తి – కాకినాడ

మహిళలు, బాలికలకు సంబంధించి వచ్చిన అర్జీలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్‌పి జి.బిందుమాధవ్‌ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెల వారి నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మాట్లాడి ఫిర్యాదులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. మహిళల రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన శక్తి యాప్‌ను మహిళలు, బాలికలు అందరికీ చెప్పి ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేయించాలన్నారు. మహిళలు, బాలికల రక్షణ, భద్రత కొరకు ఉన్న అన్ని హెల్ప్‌లైన్‌ నంబర్లను బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించాలని ఆదేశించారు. వేసవికాలంలో రాత్రి సమయంలో నేరాలు అధికంగా జరిగే అవకాశం ఉందని, నేరాలు జరగకుండా ఉండే విధంగా రాత్రి గస్తీలు పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్నా కేసులపై దర్యాప్తును త్వరగతిన పూర్తి చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను చేదించినట్లయితే వారిని రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయం బహుకరించే ఎబిసిడి అవార్డుకు నామినేట్‌ చేస్తామని తెలిపారు. జిల్లాలో ఏ ప్రాంతంలోను చైన్‌ స్నాచింగ్‌ జరగడానికి వీలు లేదన్నారు. చైన్‌ స్నాచింగ్‌ వంటికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్స్‌కి సంబంధించిన వివరాలను రికార్డుల్లో పొందుపర్చాలని ఆదేశించారు. హైస్కూల్స్‌, ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాల వద్ద మహిళలు, బాలికలకు శక్తి యాప్‌ నిక్షిప్తం, విద్యార్థులందరికీ గుడ్‌ టచ్‌-బాడ్‌ టచ్‌, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు వినియోగంపై డ్రగ్స్‌ వద్దు బ్రో వంటి అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్‌ స్టేషన్‌ శివారా ప్రాంతాలు అన్ని సిసి కెమెరాలు నిఘా పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం అనంతరం ఏలేశ్వరంలో బంగారం షాప్‌ చోరి కేసును చేదించిన అధికారులకు, గొల్లపాలెం పోలీస్‌ స్టేషన్‌ నందు అక్రమంగా తుపాకులతో సంచరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఎపిఎస్‌పి బెటాలియన్స్‌ ఐజిపి బి.రాజకుమారి జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పిలు ఎంజెవి.భాస్కరరావు, ఎఆర్‌ శ్రీనివాసరావు, ట్రైనీ ఎఎస్‌పి సుస్మిత, డిఎస్‌పిలు మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌, శ్రీహరిరాజు, ట్రైనీ డిఎస్‌పి జీవన, సిఐలు, తదితరులు పాల్గొన్నారు.

➡️