25 నుంచి 108 ఉద్యోగుల నిరవధిక సమ్మె

Nov 13,2024 23:53
108 ఉద్యోగులు నిరవధిక

ప్రజాశక్తి – కాకినాడ

ఈ నెల 25వ తేదీ నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం 108 ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగను న్నారు. ఈ మేరకు బుధవారం డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఎంహెచ్‌ఒ నరసింహనాయక్‌లకు సంఘం నాయకులు సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు పివివి.సత్యన్నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా 108 నిర్వహణ సంస్థలు మారుతున్నాయని, ఈ సందర్భంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్జిత సెలవులు, గ్రాడ్యుటి, పెండింగ్‌ బిల్లులు, వేతనాలు చెల్లిం చకుండా ఎగ్గొడుతూ ఉద్యోగులకు నష్టం చేస్తున్నాయని అన్నారు. అంబులెన్సు మరమ్మతుల ఖర్చులను ఉద్యోగుల జీతాల నుంచి కోత పెడుతున్నారని, సరిపడా సిబ్బంది లేక సెలవులు మంజూ రు చేయకుండా ఉద్యోగి యొక్క వ్యక్తిగత జీవితాన్ని హరిస్తున్నా రన్నారు. రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ అదనపు పనికి అదనపు వేతనం చెల్లించడం లేదని అన్నారు. వీటిపై ప్రభుత్వ ఉన్నత అధికా రులకు అనేక దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. 108 వ్యవ స్థను ప్రభుత్వమే నిర్వహించి, ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, పెండింగ్‌ బిల్లులు, వేతనాలు ఆర్థిత సెలవులకు అరవింద సంస్థ నుంచి ఉద్యోగులకు చెల్లించే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 4 ఏళ్ల నుంచి బకాయి పెట్టిన 40 శాతం ఇంక్రిమెంట్‌ చెల్లించాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని 108 వ్యవస్థలో అమలు చేయాలని, ప్రభుత్వ నియామకాల్లో 108 ఉద్యోగులకు వేయిటేజీ కల్పించాలని, వేతనాల స్లాబ్‌ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, ప్రతీనెలా 5 వతేది లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఉదరు భాను, ఆర్‌.శేఖర్‌, సూర్య చంద్ర పాల్గొన్నారు

➡️