వేసెక్టమీపై అనాసక్తి

Oct 30,2024 23:25
మహిళలే ముందుకు వస్తున్నారు.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ అంటే కేవలం మహిళలే ముందుకు వస్తున్నారు. పురుషులు ఆమడ దూరంలో ఉంటున్నారు. వేసెక్టమీపై అవగాహన కొరవడడంతో ఆపరేషన్‌ చేయించుకునే మగవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అన్నిట్లో ముందుండే మగాళ్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో వెనకడుగు వేస్తున్నారు. వీటిపై ప్రచారం చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి.జిల్లాలో 22,55,668 మంది జనాభా ఉన్నారు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రోత్సహిస్తోంది. 35 ఏళ్ల క్రితం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత పదేళ్లకు ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలే ముద్దంటూ ప్రచారంలోకి తెచ్చింది. ఈ మేరకు జిల్లాలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీ యూనిట్‌తో పాటు 44 పిహెచ్‌ సీలలో, 9 సిహెచ్‌సీలు, ఒక ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్లు జరుపుతున్నారు. అయితే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స మహిళలకు మాత్రమే అనే భావన సమాజంలో బలంగా పాతుకుపోయింది. సంతాన నియంత్రణ ఆపరేషన్లు స్త్రీ, పురుషుల్లో ఎవరైనా చేయించుకోవచ్చు. కానీ మగవాళ్లు దీనికి సిద్ధం కారు. జిల్లాలో 90 శాతం మంది మగవాళ్లు ఇలాగే ఉన్నారని గణాంకాలను బట్టి తెలుస్తోంది. దాదాపు మహిళలే సంతాన నియంత్రణ ట్యూబెక్టమి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.స్త్రీలే అధికంకుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ మహిళల కంటే పురుషులు చేయించుకోవడమే ఉత్తమమని, దీనికి అత్యంత సులువైన పద్ధతులున్నాయని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతున్నా దీనిపై పురుషులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 2024-25 సంవత్సరంలో అక్టోబర్‌ వరకూ కేవలం 34 మాత్రమే పురుషులు వేసక్టమీ ఆపరేషన్లు చేయించుకున్నారు. 2516 ట్యూబెక్టమి ఆపరేషన్లను స్త్రీలే చేయించు కున్నారు. మగవాళ్ల అపోహలను తొలగించడంతోపాటు ప్రోత్సాహ కాలను అందిస్తున్నా పురుషులకు పట్టడం లేదు. ట్యూబెక్టమి చేయిం చుకునే మహిళకు రూ.800, వేసెక్టమి చేయించుకునే వారికి రూ.1100 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. అయినా పురుషులు ముందుకు రావడం లేదు. ఏటా మహిళలు వేల మంది ట్యూబెక్టమి ఆపరేషన్లు చేయించుకుంటే పురు షులు చాలా తక్కువ సంఖ్యలో వేసక్టమీ చేయించుకుంటున్నారు. వైద్యుల కొరతజిల్లాలో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో వేసక్టమి ఆపరేషన్లు సక్రమంగా నిర్వహించటం లేదు. కేవలం జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో మాత్రమే ఆపరేషన్లు జరుపు తున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో ట్యూబెక్టమీ మాత్రమే చేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో వేసెక్టమి సర్జన్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కేవలం ట్యూబెక్టమీ మాత్రమే చేస్తున్నారు. 2024-25 సంవత్సరంలో జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో కేవలం ఒక్క వేసెక్టమి మాత్రమే జరిగింది. సీహెచ్‌సీలలో 3 వేసెక్టమిలు జరగ్గా 1303 ట్యూబెక్టమీ చేశారు. ఒక ఏరియా ఆస్పత్రిలో 3 వేసెక్టమిలు జరగ్గా 369 ట్యూబెక్టమీ చేశారు. జిల్లా ఆస్పత్రిలో 25 వేసెక్టమిలు జరగ్గా 760 ట్యూబెక్టమీలు చేశారు.అంతంత మాత్రంగానే అవగాహన అపోహల కారణంగా పురుషులు ఆపరేషన్‌ చేయించు కుంటే కష్టమైన పనులు చేయడానికి ఇబ్బందవుతుందనే ఆలోచనల్లో ఉన్నారు. శారీరకంగా బలహీనమవుతామనే భయం ఉంది. సంసార జీవితానికి ఆటంకమనే అనుమానం చాలా మందిలో ఉంది. కొందరు ఆడవాళ్లే తమ భర్తలను ఆపరేషన్‌కు దూరంగా ఉంచుతున్నట్లు వైద్యులు కూడా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వేసక్టమిపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిం చాల్సి ఉంది. అయితే ఆయా పీహెచ్‌సీల పరిధిలో తూతుమంత్రంగా కార్యక్రమాలను నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

➡️