సిసి టివి కెమేరాల డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు

May 16,2024 22:41
ఎన్నికల్లో పోటి చేసిన

ప్రజాశక్తి – కాకినాడ

ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు స్ట్రాంగ్‌ రూముల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జెఎన్‌టియులో సిసిటివి కెమెరాల డిస్‌ప్లే స్క్రీన్లును ఏర్పాటు చేయడం జరిగిందనికలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ తెలిపారు. సాధారణ ఎన్నికలు -2024కు సంబంధించి కాకినాడ జెఎన్‌టియులో భద్రపరిచిన ఇవిఎంల స్ట్రాంగ్‌ రూములను గురువారం ఎన్నికల అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. జెఎన్‌టియు క్యాంటీన్‌ పైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్‌ రూముల భద్రతను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల స్క్రీన్‌, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్‌ ఛాంబర్‌ మీటింగ్‌ హాలులో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్‌ రూముల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి, స్ట్రాంగ్‌ రూములు వద్ద నిర్వర్తించవలసిన విధులపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు-2024కు సంబంధించి కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ స్థానాలకు చెందిన ఇవిఎంలను జెఎన్‌టియులోని వివిధ బ్లాకుల్లో సిద్ధం చేసి స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరచడం జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రతను పరిశీలించేందుకు వీలుగా జెఎన్‌టియు క్యాంటిన్‌ పైన సిసిటివి కెమెరాల డిస్‌ ప్లే స్క్రీన్‌లను ఏర్పాటు చేసామన్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్‌ రూముల వద్ద నిరంతర విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. సిబ్బంది అంతా అప్రమత్తలతో వ్యవహరించి ప్రతి రోజూ ఉదయం స్ట్రాంగ్‌ రూముల సీల్‌లను తప్పనిసరిగా పరిశీలించాలని, స్ట్రాంగ్‌ రూముల సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు ఎప్పటికప్పుడు లాగ్‌ రిజిస్టర్‌లో నమోదు చేయడంతోపాటు వీడియో కెమెరాల్లో చిత్రించాలన్నారు. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత రిటర్నింగ్‌, ఇతర అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సిబ్బందికి సూచించారు.

➡️