సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి

Jun 10,2024 22:38
ఖరీఫ్‌లో సాగునీటి ఎద్దడి

ప్రజాశక్తి – తాళ్లరేవు

ఖరీఫ్‌లో సాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పంట విరామం ప్రకటిస్తామని రైతు సదస్సు హెచ్చరించింది. సోమవారం మండలంలోని పి.మల్లవరం డిజిబి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో మండలంలోని పి.మల్లవరం, గ్రాంటు, పత్తిగొంది, రాంజీనగర్‌, నీలపల్లి, జార్జిపేట, పోలేకుర్రు గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు, ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ బి, డ్రెయినేజీ విభాగంకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్‌, జిల్లా కార్యదర్శి వల్లు రాజు బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ, కోరంగి మాజీ సర్పంచ్‌ బర్రె లక్ష్మీనరసింహరాజు, పి.మల్లవరం ఉపసర్పంచ్‌ పంపన రామకృష్ణ, రైతు ప్రతినిధులు గుత్తుల మహేష్‌, పేరాబత్తుల సాయినరేంద్ర, విత్తనాల సత్యనారాయణ, నేతల చంటి, కావూరి వెంకటేశ్వర్లు, వానపల్లి సత్యనారాయణ, దూళిపూడి వెంకటరమణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, తదితరులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మండలంలో ప్రతీ ఏటా సుమారు 6 వేల ఎకరాలకు నీటి ఎద్దడి తలెత్తి పంటలు ఎండిపోతూనే ఉన్నాయని అన్నారు. దీనివల్ల దిగుబడి తగ్గి రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. మురుగు కాలువల ఆధునీకరణ పట్టిం చుకోకపోవడం వల్ల వర్షాకాలంలో మురుగు బోదులు ఎగదన్ని వరి పొలాల నుంచి మురుగునీరు దిగడం లేదని తెలిపారు. ఇంజరం వంతెన దిగువన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు వల్ల సాగునీరు పూర్తిస్థాయిలో కిందనున్న బ్యాంక్‌ కెనాల్‌కు రావడం లేదన్నారు. ఆ కల్వర్టును తొలగించి శాశ్వత బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. ఒఎన్‌జిసి, రిలయన్స్‌ చమురు సంస్థలు తమకు అవసరమైన సాగునీటి తరలింపు కోసం కాలువ శివారు పాయిం ట్లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కపిలేశ్వరం నుంచి పంట కాలువలు గుర్రపు డెక్కతో మూసుకు పోయాయని, వాటిని తొలగించాలన్నారు. బ్యాంక్‌ కెనాల్‌ నుంచి తాళ్ళరేవు టైలాండ్‌ భూములకు సాగునీరు అందించే సైఫాన్‌ స్థానంలో ఆత్రేయ పాయపై తొట్టె నిర్మాణం లేదా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. పూర్తిస్థాయిలో పంటలకు సాగునీరు అందిస్తేనే వ్యవసాయం చేస్తామని, లేకపోతే పంట విరామం ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. దీనిపై ఇరిగేషన్‌ ఎస్‌ఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పంట విరామం ప్రకటించవద్దన్నారు. రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి నివేదించి పూర్తిస్థాయిలో నీరు అందిస్తామన్నారు. ఆర్‌ అండ్‌ బి ఇఇ రామకృష్ణ మాట్లాడుతూ ఆరు నెలల్లోగా ఇంజరం వంతెన నిర్మాణం పూర్తి చేసి కల్వర్టు తొలగిస్తామని చెప్పారు. డ్రెయినేజీ ఎఇ సునీత, వ్యవసాయ శాఖ ఎఒ ప్రశాంతి, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందచేశారు.

➡️