ముందస్తు సాగు సాధ్యమేనా..?

Nov 29,2024 22:07
ముందస్తు సాగు సాధ్యమేనా..?

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో సాగు సీజన్‌ను ముందుకు తీసుకురావడం వల్ల ప్రకతి వైపరీత్యాల వలన నష్టం వాటిల్లకుండా బయట పడవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ధేశించిన సమయానికి రబీ పూర్తి అయితే మార్చి 15వ తేదీకల్లా పంట చేతికొస్తుంది. ఆ తర్వాత 75 రోజుల్లో అపరాలను మూడో పంటగా సాగు చేసుకోవచ్చు. జూన్‌ మొదటి వారంలోనే ఖరీఫ్‌ పనులను మొదలు పెట్టుకోవచ్చు. దీని వల్ల సీజన్‌ ముందుకు వస్తుంది. అక్టోబరు, నవంబరులలో వచ్చే తుఫానులు, వరదల వల్ల పంటనష్టం రాకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో బలమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని వ్యవసాయ శాఖ ప్రతి ఏటా చెబుతూనే ఉంది. ఈ ఏడాదీ అదే వల్లిస్తోంది. ఇదంతా బానే ఉన్నా ముందస్తు సాగు ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నా అధికార యంత్రాంగం ఆ దిశగా ఏనాడూ చర్యలు తీసుకున్న పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి. సాగునీటి వ్యవస్థలు పటిష్టమైతేనే సాగు నీరు సకాలంలో అందే అవకాశం ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం సాగునీరు సక్రమంగా అందని పరిస్థితుల్లో వేల మంది రైతులు నష్టపోతున్నారు. సరైన దిగుబడులు లేకపోవడంతో కష్టార్జితాన్ని సైతం కోల్పోతున్నారు.గోదావరి తూర్పు డెల్టా పరిధిలోని 1,05,341 ఎకరాలు, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ కింద 32,507 ఎకరాలు, ఏలేరు రిజర్వాయర్‌ కింద 53,017 ఎకరాలు మొత్తం 1,90,865 ఎకరాల ఆయకట్టుకు రబీ సాగునీరు అందించేందుకు ఇటీవల జిల్లా సాగునీటి సలహా మండలి తీర్మానించింది. డిసెంబరు 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజనులో ఈ ఆయకట్టుల రైతులు డిసెంబరు 31 నాటికి నాట్లు వేసుకుని, 2025 మార్చి 31 లోగా పంటలను పూర్తి చేసుకోవాలని రైతులకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కోరారు. మొత్తంగా ఇతర సాగునీటి వనరుల ఆధారంగా జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సుమారు 20వేల ఎకరాల్లో అపరాల సాగు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది.సాగునీటి వ్యవస్థలు పటిష్టమయ్యేనా.?ఇటీవల ఎదురైన వరదల సందర్భంగా సాగునీటి వ్యవస్థలను సమర్థవంతంగా కాపాడి, రబీ పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీటిని నిల్వలు చేసినప్పటికీ కాలువల ఆధునీకరణ సక్రమంగా లేకపోవడంతో సాగునీరు క్షేత్రస్థాయిలోకి పూర్తిస్థాయిలో వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. రబీ పంటలకు నీటి విడుదల లోపు జిల్లాలోని సాగునీటి వ్యవస్థల పటిష్టీకరణ కోసం రూ.6 కోట్ల నిధులతో పలు పనులను మంజూరు చేశారు. మంజూరు చేసిన పనులన్నిటినీ పూర్తి చేసి, బిల్లులు ఆమోదం కోసం సమర్పించాలని సాగునీటి సలహా మండలి సమావేశంలో ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారీ వరదల వల్ల జిల్లాలో ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని 6 మండలాల్లో 208 చోట్ల ఏలేరు కాలువ వెంబడి గండ్లు పడ్డాయి. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ గండ్లు పూడ్చేందుకు రూ.19.53 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లా కలెక్టర్‌ గండ్లు పూడ్చాలని ఆదేశించి రూ.5.5 కోట్ల తాత్కాలిక నిధులు కేటాయించారు. నేటికీ బిల్లులు విడుదల కాలేదు. 67 పనులను ఇప్పటి వరకు తాత్కాలిక పనుల్లో భాగంగా ఇసుక బస్తాలతో అడ్డుకట్టు వేశారు. ఈ పనులు పూర్తయితేనే గానీ సాగునీరు పూర్తిస్థాయి రైతులకు అందే పరిస్థితి కనిపించడం లేదు గండ్లు పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే సకాలంలో ముందస్తు సాగు చేపట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు అత్యవసర పనులు, మరమ్మతుల దృష్ట్యా పంపా రిజర్వాయర్‌ కింద ఆయకట్టుకు ఈ రబీలో సాగునీటి విడుదలకు అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. ఇలా జిల్లాలో కొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించగలిగితేనే సాగు పనులు సక్రమంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది.యంత్రాంగంలో కానరాని సన్నద్ధతగతేడాది రబీ సేద్యం బాగా ఆలస్యం అయింది. ఏటా డిసెంబర్‌ నెలాఖరుకి నాట్లు, మార్చి నెలాఖరులోగా వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. ముందస్తు సాగుతో మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేసి వేగవంతంగా రబీ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అందుకు అనుగుణంగా అధికారులు రైతులను సన్నద్ధం చేయలేకపోయారు. డిసెంబర్‌ మూడవ వారం దాటినప్పటికీ గత సంవత్సరం 20 శాతం కూడా సాగు పనులు పూర్తి కాలేదు. ముందస్తు సాగు అవసరం, నీటి సరఫరా నియంత్రణ షెడ్యూల్‌ అంశాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు అందుకు తగ్గట్టుగా రైతులను సన్నద్ధం చేయలేకపోయారనే విమర్శలు వ్యవసాయ శాఖపై ఏటా వినిపిస్తూనే ఉన్నాయి. రైతులకు అవగాహన కల్పించాలని అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా ఫలితం కనిపించలేదు. ఈ ఏడాదైనా అధికార యంత్రాంగం రైతులను ఏ విధంగా ముందస్తు సాగుపై సిద్ధం చేస్తుందో వేచి చూడాలి.

➡️