ప్రజాశక్తి – తుని
తుని మున్సిపల్ కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేసి లాక్కునిపోవడం దారుణమని వైసిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపికి చెందిన కౌన్సిలర్ల ఇండ్లపై దాడులు చేయడం, రౌఢషీీట్ ఓపెన్ చేయిస్తామని బెదిరింపులకు గురి చేసి లాక్కుపోవడం సరి కాదన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలు 2 దఫాలు వాయిదా పడటానికి టిడిపి పెద్దలే కారణమన్నారు. మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ల హాల్లోకి టిడిపి గుండాలు వెళ్లి దౌర్జన్యంగా ప్రవర్తించడంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. మహిళా కౌన్సిలర్లు కోర్టును ఆశ్రయించటం జరిగిందని తెలిపారు. తుని మున్సిపాలిటీలో 30 మంది వైసిపికి చెందిన వారే కౌన్సిలర్లగా గత ఎన్నికల్లో విజయం సాధించారని, టిడిపి కనీసం ఒక్క కౌన్సిలర్ కూడా లేరన్నారు. ఒక కౌన్సిలర్ మృతితో ప్రస్తుతానికి 29 మంది కౌన్సిలర్లు ఉన్నారని వివరించారు. మాజీ ఎంఎల్‌ఎ రాజా అశోక్ బాబు కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తానంటూ బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అశోక్ బాబు ఇంత దిగజారుడి రాజకీయాలు చేయడం సరి కాదన్నారు. కూటమి నాయకులు ఎన్ని కుట్రలకు పాల్పడినా మున్సిపల్ ఎన్నికల్లో వైసిపిదే విజయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.