ప్రజాశక్తి – కాకినాడ
కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బుధవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు, ఐఎఫ్‌టియు, ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రాజు మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు లాభాలను పెంచేందుకు కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని అన్నారు. ఆనాడు పార్లమెంటులో వైసిపి, టిడిపి పార్లమెంటు సభ్యులు వీటికి మద్దతుగా నిలిచారని అన్నారు. ఇవి అమలులోకి వస్తే భారీ పరిశ్రమలు సైతం కార్మిక చట్టాల నుంచి మినహాయించబడి వాటిలో పనిచేసే కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు తమ బలప్రయోగంతో లేబర్ కోడ్‌లతో ఇష్టానుసారం మార్పులు చేసి కార్మికుల శ్రమను మరింత దొచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశాలు కల్పించిందన్నారు. 500 లోపు కార్మికులు ఉండే పరిశ్రమలలో సేఫ్టీ అధికారి ఉండాల్సిన అవసరం లేదని, అంబులెన్స్ కూడా తొలగించుకోవచ్చనే ప్రమాదకర నిర్ణయాలు ఈ లేబర్ కోడ్లలో ఉన్నాయని తెలిపారు. యాజమాన్యాలు కనీస వేతనాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ లాంటి ప్రాథమిక చట్టాలను అమలు చేయకపోయినా వాటిపై విధించే శిక్షలను ఈ లేబర్ కోడ్లలో తొలగించి దేశ కార్మిక వర్గాన్ని ఏ హక్కులు లేని బానిసలుగా మారుస్తున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా సంఘాలతో నిమిత్తం లేకుండా కార్మికులందరూ ఐక్య పోరాటాలు నిర్వహించడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, కోశాధికారి మలకా వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి.రాజా, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకటరావు, రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాదు, ఆఫీస్ కార్యదర్శి రాణి, అజరుకుమార్, పాసుబాబు, చంద్రరావు, త్రిమూర్తులు, మెస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఏడుకొండలు, సాల్మన్ రాజు, విజరు, ఐఎఫ్‌టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాఘవులు, యేసు, బాలరాజు, దుర్గారావు, నాగేశ్వరరావు, ఎఐసిసిటియు నాయకులు నరసరాజు తదితరులు పాల్గొన్నారు.