అంచనాల్లో నేతలు…!

May 14,2024 23:19
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. వచ్చే నెల 4న కౌంటింగ్‌, అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. దేశ వ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులతోపాటు రాజకీయ నాయ కులు, జిల్లా ప్రజల్లోనూ ఫలితాలపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఇటు ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది. కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్‌ జరిగింది.

జిల్లా వ్యాప్తంగా 16,34,122 మంది ఓటర్లు న్నారు. 78.52 శాతం అంటే 12,13,131 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఓటర్లలో ఓటు హక్కు విని యోగంపై చైతన్యం బాగా పెరిగింది. ఉదయం 6 గంటలకే వందల సంఖ్యలో ఆయా పోలింగ్‌ బూత్‌లకు చేరుకుని ఓటు వేసేందుకు బారులు తీరారు. రాత్రి 9 గంటల వరకు కూడా గంటలు తరబడి క్యూ లైన్లలో నిలబడి జనం ఓటేశారు. కొన్నిచోట్ల 11 గంటల వరకు కూడా పోలింగ్‌ కొనసాగిన పరిస్థితులు ఉన్నాయి.లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు జిల్లాలో గతం కంటే భారీగా నమోదైన పోలింగ్‌పై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. బూతుల వారీగా పోలైన ఓట్ల వివరాలను దగ్గర పెట్టుకుని అంచనాలు వేసుకుంటున్నారు. ఏజెంట్ల సహకారంతో ఏయే వర్గాల ఓట్లు తమ వైపునకు వచ్చాయనే లెక్కలు వేసుకుంటున్నారు. తీర్పు తమకే అనుకూలమని కూటమి పార్టీలు ధీమాగా ఉన్నాయి. అటు అధికార వైసిపి నేతలు కూడా అంచనాల్లో మునిగి తేలుతున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన వైసిపి అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ గెలుపు తనదే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మూడుసార్లు పోటీ చేసి ఓడిపోవడంతో సానుభూతి ఉందని, తనకున్న కంపెనీలలో అనేకమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పార్లమెంట్‌ పరిధిలో ప్రతి గ్రామానికి రూ.కోటి చొప్పున 400 గ్రామాలకు రూ.400 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీతో ప్రజలు తనను కచ్చితంగా గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఉదరు శ్రీనివాస్‌ తనకే గెలుపు ఛాన్స్‌ ఉందంటూ ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు అనుకూలంగా పోలింగ్‌ పెద్దఎత్తున జరిగిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. భారీ మెజారిటీతో గెలుపొందుతారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు అధికార పార్టీ నుంచి బరిలో ఉన్న వంగా గీత కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. వైసిపి ప్రభుత్వం అమలు జరిపిన సంక్షేమ పథకాల వలన ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆమె చెబుతున్నారు. కాకినాడ సిటీలో మళ్లీ ప్రజలు తనకే పట్టం కట్టనున్నారంటూ సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు పేదలను ఎంతగానో ఆదుకున్నాయని, కాకినాడను స్మార్ట్‌ సిటీగా బాగా అభివృద్ధి చేయడంతో మెజారిటీ ఓటర్లు తమ వైపే ఉన్నారనే చెప్పుకుంటున్నారు. మరోవైపు కూటమి బలంతో కచ్చితంగా గెలుపు నాదే అంటూ వనమాడి కొండబాబు ఆనందంతో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాకినాడ రూరల్‌లో గట్టి పోటీ జరిగింది. మాజీ మంత్రి కన్నబాబు, జనసేన అభ్యర్థి నానాజీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై అంచనాలు దొరకడం లేదు. కానీ ఎవరికి వారు గెలుపు ధీమాతో సాగుతున్నారు. జగ్గంపేటలో నువ్వా నేనా అంటూ తలపడిన మాజీ మంత్రి తోట నరసింహం, టిడిపి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మధ్య రసవత్తర పోరు జరిగింది అయితే ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు దశాబ్దాలుగా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతున్న తనకే ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారని నెహ్రూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి చినరాజప్ప మూడోసారి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూటమి పార్టీల నేతలు అంచనాలు వేస్తున్నారు. సౌమ్యుడుగా పేరు ఉన్న ఆయన టిడిపి హయాంలో పెద్ద ఎత్తున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెబుతున్నారు. మరోవైపు వైసిపి అభ్యర్థి దవులూరి దొరబాబు సైతం గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ సానుభూతితో విజయం తప్పకుండా సాధిస్తుందని ఆమె అనుచరులు అభిప్రాయపడుతున్నారు. తునిలో వైసిపి అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు చాన్స్‌ ఎక్కువగా ఉందని ఆయన అనుచరులు ధీమాతో ఉన్నారు. అటు కూటమి అభ్యర్థి యనమల దివ్య కూడా టిడిపి గెలుపు ఖాయం అంటూ అంచనాల్లో ఉన్నారు. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌ వారీగా ఓటింగ్‌ వివరాలను తీసుకుని అంచనాలను రూపొందించుకున్నారు.

➡️