ప్రజాశక్తి – కాకినాడ
ప్రయాణం చేసే క్రమంలో ప్రతీ ఒక్కరూ ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నగర పాలక సంస్థ కమిషనర్ భావన సూచించారు. మంగళవారం స్థానిక డాక్టర్ బిఆర్.అంబేద్కర్ భవనంలో రహదారి భద్రతా మాసోత్సవాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ కె.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వాహనదారులు వేగం కన్నా ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చి తమ ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. నగరంలో అనేక రహదారులపై ఆటోలు, ఇతర వాహనాలు ఇష్టానుసారంగా కాకుండా క్రమపద్ధతిలో నిలుపుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నివారణకు అనేక చర్యలు చేపట్టామని, వాహనదారులు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ సిఐ ఎన్.రమేష్ మాట్లాడుతూ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సకాలంలో సమీప ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో బాధితులకు సాయం చేస్తున్న వారిపై ఎటువంటి ఒత్తిడులు ఉండవని, సాక్ష్యాలు, కోర్టులు తదితర అంశాలపై నిబంధనలు పూర్తిగా రద్దు చేశారని, ప్రమాదం జరిగిన వెంటనే బాధితునికి చేసే సాయంపై ప్రభుత్వం తగిన పారితోషికం అందిస్తుం దని అన్నారు. ఈ కార్యక్రమంలో మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లు హరనాథ్‌రెడ్డి, మురళీకృష్ణ, లక్ష్మీ కిరణ్, గౌరీశంకర్, సాయిబాబా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, ఆటో డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు.