సంక్షేమ బోర్డు కోసం ఎదురు చూపులు

Feb 4,2025 22:33
సంక్షేమ బోర్డు చట్టం అమలు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

సిఐటియు ఆధ్వర్యంలో కేంద్రంతో పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు చట్టం అమలు కోసం భవన నిర్మాణ కార్మికులు ఎదురుచూపులు చూస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం సంక్షేమ బోర్డుని పూర్తిగా విస్మరించింది. కార్మికుల శ్రమతో సెస్సు రూపంలో వసూలు చేసిన రూ. వందల కోట్ల నిధులను ఇతర కార్యకలాపాలకు మళ్లించి అన్యాయం చేసింది. కేంద్రంతో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని గత వైసిపి ప్రభుత్వం పూర్తిగా కాలరాసింది. సంక్షేమ బోర్డును నిలుపుదల చేస్తూ 2021 సెప్టెంబరులో మెమో 1214ను తీసుకొచ్చింది. దీంతో వేలాదిమంది నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 53 రకాల భవన నిర్మాణ పనులు చేస్తూ దాదాపు 5 లక్షల మంది కార్మికులు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.అనేక పోరాటాలుగత వైసిపి ప్రభుత్వం లోపాభూయిష్టమైన విధానాలను అనుసరించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను పక్కదారి పట్టించడంతో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు అనేక రూపాల్లో ఆందోళనలు చేశారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద ధర్నాలు చేసి వినతి పత్రాలు అందజేశారు. సంక్షేమ బోర్డు నిధులను కార్మికులకు మాత్రమే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేస్తూ దఫదఫాలుగా నిరసనలు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పరిహారాలను తక్షణం విడుదల చేయాలంటూ డిమాండ్లు చేశారు. దేశ వ్యాప్త సమ్మె, చలో కలెక్టరేట్లు, మంత్రుల ఇళ్ల ముట్టడి వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కార్మికులను బలవం తంగా ఈడ్చి కెళ్ళి అరెస్టు చేయడం వంటి ఘటనలు జరిగాయి. అయితే ఈలోపు గత ప్రభుత్వం పదవీకాలం ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భవన నిర్మాణరంగ కార్మికులు గత ప్రభుత్వా నికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. తమ సమస్యలను పరిష్కరిస్తుందని చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా సంక్షేమ బోర్డు విషయంలో నేటికీ స్పష్టత లేకుండా ఉంది. సంక్షేమ బోర్డుని పునరుద్ధరి స్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటూ తేల్చడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రియల్‌ 1 నుంచి సంక్షేమ బోర్డు పథకాల అమలును ప్రభుత్వం పరిశీలిస్తోందని కార్మికులు, సిఐటియు నాయకులకు అధికారులు చెప్పుకొస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేసి తీవ్ర అన్యాయం చేసిందని ఎన్నికల్లో కూటమి నాయకులు ఆరోపిండమే కాకుండా తమతో ఓట్లెయించుకున్నారని కూటమి నేతలపై కార్మికులు మండిపడుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు పధకాలను పునరుద్ధరించలేదని విమర్శిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిర్మాణ కార్మికుల సమస్యలను, పెండింగ్లో ఉన్న క్లైములను పరిష్కరించాలని కోరుతున్నారు.

➡️