ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాల్లో కళ్లు చాలా కీలకం. అటువంటి కంటి వైద్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంటి సమస్యలతో బాధ పడే పేద, మధ్యతరగతి వర్గాలకు సేవలందించడానికి ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల ద్వారా కంటి పరీక్షలు చేసి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 25 సిహెచ్‌సిలలో సేవలు అందించేవారు. ప్రస్తుతం ఈ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గతేడాది సెప్టెంబర్ 4వ తేదీతో అపోలో సంస్థతో ఒప్పందం ముగియడంతో అప్పటినుంచి ఈ కేంద్రాలు మూతపడ్డాయి. 2018లో ప్రారంభించినప్పటికీ గత వైసిపి ప్రభుత్వంలో కంటి జబ్బులకు సంబంధించి ఒపి దగ్గర్నుంచి శస్త్రచికిత్సల వరకు అన్ని సేవలు ఉచితంగా అందించేవారు. ఆప్తాల్మిక్ అసిస్టెంట్లను కూడా నియమించారు. కొంతకాలం క్రితం వారినీ తొలగించడమే కాక వేతన బకాయిలను కూడా చెల్లించలేదు. ఈ-ఐ కేంద్రాల్లో సామగ్రి, వైద్య పరికరాలు, కంప్యూటర్లను కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది.నిరాశతో వెనుతిరుగుతున్న రోగులుఅన్ని సిహెచ్‌సిలలో కంటి వైద్య సేవలకు మంగళం పాడడంతో పలువురు రోగులు ఆసుపత్రుల చుట్టూ తిరగలేకపోతున్నారు. కంటి వైద్య పరీక్షల కోసం ప్రతి రోజూ పదుల సంఖ్యలో పేద ప్రజలు వస్తున్నారు. వారికి కేంద్రాలు మూతపడిన సంగతి తెలియక నిరాశ చెందుతున్నారు. అత్యవసరంగా కంటి వైద్య పరీక్షలు అవసరమైన వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల ద్వారా ఒప్పందం ముగిసేటప్పటికి దాదాపు 3 లక్షల మందికి కంటి చికిత్సలు అందించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 30 నుంచి 50 మంది వరకు ఒపిలు నమోదు చేసుకునేవారు. అన్నిరకాల పరీక్షలు చేసి అవసరమైన వారికి రెండు వారాల్లోపే కళ్లద్దాలు అందించేవారు. దీంతో ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాలకు రోగుల నుంచి ఆదరణ పెరిగింది. కళ్లలో పొరలు, శుక్లాల సమస్యలు ఉన్నవారిని గుర్తించి జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేవారు.వ్యయ, ప్రయాసలుఈ కేంద్రాలు మూతపడడంతో పలువురు రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో అనేక వ్యయ, ప్రయాసలు తప్పడం లేదని వాపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఒపి, ఇతర ఫీజులు, ఖర్చులను భరించలేక సామాన్య రోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కంటి చికిత్సలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒపికి రూ.300 అవుతుంది. కళ్లద్దాలు కావాలంటే రూ.1000 నుంచి రూ.2000 అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఫలితంగా పేదలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ-ఐ కేంద్రాలను వెంటనే తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని పేద, మధ్య తరగతి ప్రజలు కోరుతున్నారు. ఒప్పంద గడువు పొడిగించకపోవడంతో ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల్లో 8 ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులు జీవనోపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజల అవసరాలను దష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి ఈ-ఐ సేవలను తిరిగి పునరుద్ధరించాలని పలువురు సామాన్య రోగులు కోరుతున్నారు.
