నగర వనాల ఏర్పాటుకు చర్యలు

Feb 4,2025 22:36
నగరవనాలు ఏర్పాటుకు అధికారులు

ప్రజాశక్తి – పిఠాపురం, గొల్లప్రోలు, ఏలేశ్వరం

జిల్లాలో నగర, పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అవసరమైన నగరవనాలు ఏర్పాటుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి అధికారులను ఆదేశించారు. మంగళవారం పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రక్కన ఉన్న ప్రదేశాన్ని రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. భూ రీకార్డులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో నగర, పట్టణ ప్రాంతాల్లో జిల్లాలో నగర వనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ పనులకు సంబంధించి రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ప్రభుత్వ భూములు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఎకో టూరిజం కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు. అనంతరం ఆయన గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ పరిధిలోని ఆక్రమిత భూములను పరిశీలించారు. గత 30 ఏళ్లుగా సుమారు 450 ఎకరాల ప్రభుత్వ భూమిని చెందుర్తి, కొడవలి గ్రామాలకు చెందిన బిసి, ఎస్‌సి సామాజికవర్గాలకు చెందిన పేదలు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన రీ సర్వేలో ఆ భూమి ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ భూములను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పేదల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉన్న అవకాశాలపై అధికారులతో ఆయన చర్చించారు. భవిష్యత్తులో స్థాపించబోయే పరిశ్రమలకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అనంతరం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి జెడ్డంగి అన్నవరం వరకు నిర్మిస్తున్న ఆర్‌ అండ్‌ బి రహదారిని పరిశీలించారు. రమణయ్యపేటలోని ఎంపిపి ఆదర్శ పాఠశాల వద్ద రహదారి నిర్మాణానికి అనుసరిస్తున్న విధానాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆర్‌డిఒ ఎస్‌ మల్లిబాబు, పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్‌ కనకారావు, పిఠాపురం, గొల్లప్రోలు, ఏలేశ్వరం తహశీల్దార్లు, ఎంపిడిఒలు, సర్వే అధికారులు పాల్గొన్నారు.

➡️